NaMo TV: ఎన్నికల సమయంలో హడావుడి చేసి.. పూర్తయ్యాక పత్తాలేకుండా పోయిన నమో టీవీ!
- ఎన్నికల్లో నమోటీవీ ద్వారా విస్తృత ప్రచారం
- విపక్షాలు తీవ్ర విమర్శలు
- ఎన్నికలు ముగియడంతో దండగని భావించి నిలిపివేశారంటున్న విపక్షాలు
ఎన్నికల షెడ్యూలు విడుదల కాగానే హడావుడి చేసిన నమోటీవీ ఎన్నికలు పూర్తవగానే పత్తాలేకుండా పోయింది. బీజేపీ నిధులతో ప్రారంభమైన నమోటీవీపై అప్పట్లో ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. ఆ టీవీలో ప్రధాని మోదీ ఇంటర్వ్యూలు, ర్యాలీలు, ప్రభుత్వ పథకాల గురించి ప్రచారం జరుగుతోందని ఆరోపించాయి. నమోటీవీపై విపక్షాలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. దీంతో స్పందించిన ఈసీ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ నుంచి వివరణ కోరింది. ధ్రువీకరించిన కార్యక్రమాలనే అందులో ప్రసారం చేయాలని ఆదేశించింది.
కాగా, ఎన్నికల సమయంలో హల్చల్ చేసిన నమోటీవీ ఎన్నికలు పూర్తి కాగానే మాయమవడంపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఎన్నికలు ముగిశాయి కాబట్టి ఇక నమోటీవీ అవసరం ఉండదని, దాని నిర్వహణ వృథా అని భావించి నిలిపివేసి ఉంటారని ఆరోపించాయి. కాగా, నమోటీవీపై చర్యలు తీసుకోకపోవడాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తప్పుబట్టారు. ఈసీ పక్షపాత వైఖరితో వ్యవహరించిందని ఆరోపించారు. నమోటీవీలో జరిగిన ప్రచారం ఓటింగ్‌పై ప్రచారం చూపించి ఉంటుందని అన్నారు.