Lok Sabha: వైఎస్ జగన్, మాయావతి, స్టాలిన్, నవీన్ పట్నాయక్... ప్రస్తుతం అందరి ఆలోచనా ఇదే!
- వ్యూహాలను మార్చుకున్న ప్రాంతీయ పార్టీలు
- ఏ కూటమిలో చేరకుండా వేచి చూసే ధోరణి
- ఫలితాల వెల్లడి వరకూ నిర్ణయం చెప్పరాదని నిర్ణయం
ఎగ్జిట్ పోల్స్ ఫలితాల నేపథ్యంలో ప్రాంతీయ పార్టీల వ్యూహం మారింది. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ కూటములలో లేని తటస్థ పార్టీలన్నీ వేచిచూసే ధోరణిలో ఉన్నాయి. ఫలితాలు పూర్తిగా వెల్లడై, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయో, అధికారానికి ఎవరి కూటమి దగ్గరగా ఉందో తెలుసుకున్న తరువాతే అడుగులు వేయాలని పలు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు భావిస్తున్నాయి. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ క్యాంప్ లలో ప్రస్తుతానికి చేరరాదన్న ఆలోచనలో ఉన్న నాయకుల జాబితా పెద్దదిగానే కనిపిస్తోంది. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, ఉత్తర ప్రదేశ్ లో బీఎస్పీ అధినేత్రి మాయావతి, తమిళనాడులో డీఎంకే నేత స్టాలిన్ తదితరులు ఫలితాల తరువాతే ఓ నిర్ణయానికి రావాలని భావిస్తున్నారు.
ఫెడరల్ ఫ్రంట్ పేరిట తటస్థులను ఒక తాటిపైకి తేవాలని ప్రయత్నిస్తున్న కేసీఆర్ కు సైతం వీరి నుంచి స్పష్టమైన హామీ లభించలేదు. ఇక జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కూటమికి మద్దతు పలుకుతూ, పలువురు నేతలను కలిసిన చంద్రబాబుకు సైతం అదే సమాధానం వచ్చింది. వీరిద్దరూ ఏ నేతను కలిసినా, వారి నుంచి కొంతకాలం ఆగిన తరువాత నిర్ణయం తీసుకుందామన్న మాటే లభించినట్టు తెలుస్తోంది. 100కు పైగా ఎంపీ స్థానాలను తటస్థులు గెలిస్తే, బీజేపీనైనా, కాంగ్రెస్ నైనా శాసించవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి మాత్రం ప్రాంతీయ పార్టీ నేతల ఆలోచనలన్నీ ఫలితాల వరకూ వేచిచూసే దిశగానే సాగుతున్నాయి.