Nadhuram Gadse: ఘనంగా గాడ్సే పుట్టిన రోజు వేడుకలు... ఆరుగురు హిందూ మహాసభ కార్యకర్తల అరెస్ట్!
- సూరత్ లోని దేవాలయంలో వేడుకలు
- సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు
- తప్పుబట్టిన బీజేపీ నేతలు
మహాత్మా గాంధీని కాల్చిచంపిన నాధూరామ్ గాడ్సే పుట్టిన రోజు వేడుకలను నిర్వహించిన ఆరుగురు హిందూ మహాసభ కార్యకర్తలను గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. సూరత్ కు చెందిన హిందూ మహాసభ కార్యకర్తలు ఓ దేవాలయంలో గడచిన ఆదివారం నాడు గాడ్సే జయంతి వేడుకలు జరిపారు. ఇక్కడి లింబాయత్ ప్రాంతంలోని సూర్యముఖి హనుమాన్ దేవాలయంలో, గాడ్సే ఫోటో చుట్టూ దీపాలు వెలిగించి, పూజలు చేశారు.
ఆపై మిఠాయిలు పంచుకుని, భజన కార్యక్రమాల్ని నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో, వారు కేసు నమోదు చేసి ఆరుగురిని అరెస్ట్ చేశారు. గాంధీని చంపిన వ్యక్తికి పుట్టిన రోజు వేడుకలు జరపడం విచారకరమని, ఈ తరహా చర్యలతో ప్రజల మనోభావాలు దెబ్బ తింటాయని ఈ సందర్భంగా ఓ పోలీసు అధికారి వ్యాఖ్యానించారు. పలువురు బీజేపీ నేతలు సైతం హిందూ మహాసభ కార్యకర్తల వైఖరిని తప్పుబట్టారు.