kalpana: 'ముసుగువెయ్యొద్దు మనసు మీద' సాంగ్ మంచి పేరు తెచ్చిపెట్టింది: సింగర్ కల్పన
- తొలి పాట 'మనోహరం' కోసం పాడాను
- దేవిశ్రీ ప్రసాద్ నా పాటనే ఉంచారు
- ఇంతవరకూ 1500 పాటలు పాడాను
తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో గాయని కల్పన మాట్లాడుతూ, తన కెరియర్ కి సంబంధించిన విషయాలను గురించి ప్రస్తావించింది. "తమిళంలో గాయనిగా నన్ను పరిచయం చేసింది శంకర్ గణేశన్ గారు. తెలుగులో 'మనోహరం' సినిమాలో 'మంగళ గౌరికి' అనే పాట నా తొలి పాట. ఆ తరువాత 'ఆనందం' సినిమా కోసం 'మోనాలీసా నా సిస్టరే' అనే పాటకు దేవిశ్రీ ప్రసాద్ గారు నాతో ట్రాక్ పాడించారు. నేను పాడిందే బాగుందని అలాగే ఉంచేశారు.
'ఖడ్గం' సినిమా కోసం పాడిన 'ముసుగు వెయ్యొద్దు మనసు మీద .. వలలు వెయ్యొద్దు వయసు మీద' నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తరువాత 'వెంకీ' సినిమా కోసం పాడిన 'గోంగూర తోటకాడ' పాట కూడా జనంలోకి బాగా వెళ్లింది. 'పెళ్లాం ఊరెళితే' సినిమాలోని 'దొండపండులాంటి పెదవే నీది' పాట కూడా నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లో ఇంతవరకూ ఓ 1500 పాటలు పాడి వుంటాను" అని చెప్పుకొచ్చింది.