shivsena: రాహుల్, ప్రియాంకలను ప్రశంసించిన శివసేన
- ఎన్నికల్లో రాహుల్, ప్రియాంకలు చాలా కష్టపడ్డారు
- ప్రతిపక్ష హోదా పొందేందుకు అవసరమైన సీట్లు వారికి వస్తాయి
- కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా బీజేపీకే లీడ్ వస్తుంది
ప్రధాని మోదీ నాయకత్వంలోని ఎన్డీయే మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని శివసేన ధీమా వ్యక్తం చేసింది. ఇదే సమయంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంకగాంధీలపై ప్రశంసలు కురిపించింది. ఎన్నికల్లో రాహుల్, ప్రియాంకలు చాలా కష్టపడ్డారని... లోక్ సభలో ప్రతిపక్ష పార్టీ హోదా పొందేందుకు అవసరమైన సీట్లు కాంగ్రెస్ కు వస్తాయని తెలిపింది. ఈ మేరకు తన పత్రిక సామ్నాలో కథనాన్ని ప్రచురించింది.
మోదీ మరోసారి ప్రధాని అవుతారని చెప్పడానికి రాజకీయ పండితులు అవసరం లేదని శివసేన వ్యాఖ్యానించింది. మోదీని మళ్లీ ప్రధానిని చేయాలనే నిర్ణయానికి ప్రజలు ఎప్పుడో వచ్చేశారని తెలిపింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ లతో పాటు మమతాబెనర్జీ రాష్ట్రమైన పశ్చిమబెంగాల్ లో కూడా బీజేపీకి క్లియర్ మెజార్టీ వస్తుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయని చెప్పింది. మహారాష్ట్రలో బీజేపీ-శివసేన కూటమి చారిత్రాత్మక విజయం సాధిస్తుందని తెలిపింది. ఏది ఏమైనప్పటికీ కచ్చితమైన ఫలితాల కోసం 23వ తేదీ వరకు వేచి చూద్దామని వ్యాఖ్యానించింది.