Thirong Abo: అరుణాచల్ ప్రదేశ్ లో ఉగ్రదాడి.. ఎమ్మెల్యే సహా 10 మంది మృతి
- బొగాపాని వద్దకు రాగానే కాల్పులు
- మృతుల్లో ఎమ్మెల్యే కొడుకు ఉన్నట్టు సమాచారం
- ఘటనపై ట్విట్టర్ ద్వారా స్పందించిన సీఎం
అరుణాచల్‌ప్రదేశ్‌లో జరిగిన ఉగ్రదాడిలో ఎమ్మెల్యే, ఇద్దరు భద్రతా సిబ్బంది సహా 10 మంది హతమయ్యారు. తిరాప్ జిల్లాలోని బొగాపాని గ్రామంలో మాటు వేసిన ఎన్ఎస్సీఎన్ అనుమానిత ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. నేడు అసోం నుంచి తన నియోజకవర్గమైన ఖోన్సాకు ఎమ్మెల్యే తిరోంగ్ అబో తన భద్రతా సిబ్బంది, మరో ఎనిమిది మందితో కలిసి వెళుతుండగా బొగాపాని వద్దకు రాగానే కాల్పులు జరిపారని ఆ ప్రాంత డిప్యూటీ పోలీస్ కమిషనర్ పీఎన్ తుంగోన్ తెలిపారు.
మృతుల్లో ఎమ్మెల్యే తిరోంగ్ అబో కుమారుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్పీపీ అధ్యక్షుడు, మేఘాలయా ముఖ్యమంత్రి కన్రాద్ సంగ్మా ఘటనపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘ఈ వార్త తెలుసుకొని ఎన్పీపీ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఈ దాడి జరిపిన వారిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పీఎంవోను కోరుతున్నాం’ అని ట్వీట్ చేశారు.