Facebook: రైల్లో వేధింపులు, పోలీసుల నిర్లక్ష్యం: ఫేస్ బుక్ లో ఓ యువతి వ్యధ
- బెంగళూరులో ఐటీ ఉద్యోగినిగా పనిచేస్తున్న బాధితురాలు
- రైల్లో వెళుతుంటే వృద్ధుడి వేధింపులు
- కేసు నమోదు చేసుకోవడంలో నిర్లక్ష్యం
తనతో అసభ్యంగా ప్రవర్తించిన వృద్ధుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళితే, వారు ప్రశ్నలతో వేధించడంతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఓ యువతి ఫేస్ బుక్ లో ఆవేదన వ్యక్తం చేయగా, ఆమెకు ఎంతో మంది బాసటగా నిలిచారు. బాధితురాలు ఫేస్ బుక్ లో వెల్లడించిన వివరాల ప్రకారం, బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్న ఆమె, ఈనెల 17న రైలులో స్నేహితులతో కలసి కేజీఎఫ్ పట్టణానికి బయలుదేరింది. రైలు బయలుదేరిన కాసేపటికి, ఆమె నిద్రలోకి జారుకోగా, వెనుకనే కూర్చున్న 55 ఏళ్ల వ్యక్తి ఆమె వెనుకభాగాన్ని తడుముతూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీన్ని గమనించిన ఆమె, నిలదీయగా, మరింతగా రెచ్చిపోయాడు. పక్క బోగీలోనే ఉన్న తన స్నేహితులను ఆమె పిలువగా, ఈలోగా సదరు వృద్ధుడు వైట్ ఫీల్డ్ స్టేషన్ లో దిగి వెళ్లిపోయాడు.
జరిగిన ఘటనపై తొలుత వైట్ ఫీల్డ్ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా, అది తమ పరిధి కాదని, అడుగోడి పోలీసుల వద్దకు వెళ్లాలని సూచించారు. అడుగోడి పోలీసు స్టేషన్ లోనూ ఆమెకు నిరాశే ఎదురైంది. వారు కూడా తమ పరిధి కాదని, రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పారు. బాధితురాలు కంటోన్మెంట్ పోలీసులను ఆశ్రయించి, తనకు జరిగిన అన్యాయాన్ని చెబితే, నిందితుడి ఫోటో ఉందా?, అడ్రస్ ఉందా?, అతని పేరేంటి? వంటి ప్రశ్నలు వేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించారని వాపోయింది. ఈ పోస్ట్ ను కేంద్ర రైల్వేశాఖతో పాటు మహిళ శిశు సంక్షేమశాఖకు కూడా బాధితురాలు ట్యాగ్ చేసింది. ఈ పోస్ట్ వైరల్ కాగా, నిందితుడిని పట్టుకోవాల్సిందేనని పోలీసులపై ఒత్తిడి పెరుగుతోంది.