Jagan: జగన్ నివాసం వద్ద పోలీసు భద్రత పెంపు... చేరుకున్న రెండు కంపెనీల ఫోర్స్!
- గుంటూరు జిల్లా తాడేపల్లిలో జగన్ నివాసం
- రేపు వెల్లడికానున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
- చంద్రబాబు నివాసం వద్ద కూడా అదనపు భద్రత
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు, సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు ఉదయం ప్రారంభం కానుండగా, గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ నివాసం వద్ద పోలీసు భద్రతను పెంచారు. ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా గెలుపొందిన అభ్యర్థులు, ఆ వెంటనే తమ పార్టీ అధినేతల ఇళ్లకు లేదా కార్యాలయాలకు చేరుకునే అవకాశం ఉన్నందున ముందుజాగ్రత్త చర్యగా భద్రతను పెంచినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి.
ఇక సీఎం చంద్రబాబు నివాసం వద్ద కూడా అదనపు భద్రతను ఏర్పాటు చేసినట్టు తెలిపాయి. ఏపీఎస్పీ (ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్)కు చెందిన రెండేసి కంపెనీలు పహారాలో ఉంటాయని, వారికి గుంటూరు అర్బన్ పోలీసులు సహకరిస్తారని, స్థానిక పోలీసులు షిఫ్ట్ కు 50 మంది చొప్పున అదనంగా భద్రత విధుల్లో ఉంటారని వెల్లడించాయి. ఇక చంద్రబాబు, జగన్ నివాసాల వద్ద ప్రత్యేక పార్కింగ్ సౌకర్యాలను కూడా ఏర్పాటు చేసినట్టు తెలిపారు.