Anil Ambani: కాంగ్రెస్ పై వేసిన పరువునష్టం దావాను వెనక్కు తీసుకోనున్న అనిల్ అంబానీ!
- కాంగ్రెస్, నేషనల్ హెరాల్డ్ పై రూ. 5 వేల కోట్ల దావా
- ఆరోపణలన్నీ రాజకీయ విమర్శలే
- అందుకే కేసులు వెనక్కన్న అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూప్
కాంగ్రెస్ నేతలపైనా, నేషనల్ హెరాల్డ్ దినపత్రికపైనా వేసిన రూ. 5 వేల కోట్ల పరువునష్టం దావాను వెనక్కు తీసుకోవాలని అనిల్ అంబానీ నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని అడాగ్ (అనిల్ దీరూభాయ్ అంబానీ గ్రూప్) అనుబంధ అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూప్ వెల్లడించింది. గతంలో రాఫెల్ ఫైటర్ జెట్ డీల్ పై కాంగ్రెస్ పలు ఆరోపణలు చేసిన వేళ, తమ పరువుకు నష్టం కలిగిందని అనిల్ అంబానీ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే, సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ, ఇవి రాజకీయ పరమైన విమర్శలేనని తాము నమ్ముతున్నామని, ఆ కారణంగానే కేసును వెనక్కు తీసుకుంటున్నామని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.
కాగా, ఈ కేసులు అహ్మదాబాద్ కోర్టులో దాఖలు కాగా, కోర్ట్ ఆఫ్ సిటీ సివిల్ అండ్ సెషన్స్ జడ్జ్ పీజే తమాకువాలా విచారిస్తున్నారు. రిలయన్స్ గ్రూప్, దస్సాల్ట్ ఏవియేషన్ సంస్థలు కుదుర్చుకున్న ఒప్పందం వెనుక పెద్దఎత్తున డబ్బులు చేతులు మారాయని, అనిల్ అంబానీకి ప్రజా ధనాన్ని దోచిపెట్టారని కాంగ్రెస్ నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే. తాజా ప్రకటనలో ఎవరి పేరునూ వెల్లడించకుండా, పరువునష్టం కేసులను ఉపసంహరించుకుంటున్నట్టు రిలయన్స్ వెల్లడించింది.