Andhra Pradesh: ఏపీ ఎన్నికల సంఘంపై మండిపడ్డ టీడీపీ నేత పయ్యావుల కేశవ్!
- ఉరవకొండలో కౌంటింగ్ ఏర్పాట్లపై అసంతృప్తి
- ఇరుకైన ప్రాంతంలో ఏర్పాటు చేశారని ఆగ్రహం
- ఈసారి కూడా గెలుపు టీడీపీదేనన్న కేశవ్
ఏపీ ఎన్నికల సంఘం అధికారులపై టీడీపీ నేత, ఉరవకొండ అభ్యర్థి పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌంటింగ్ కోసం ఈసీ చేసిన ఏర్పాట్లు అధ్వానంగా ఉన్నాయని ఆయన మండిపడ్డారు. ఉరవకొండలో కౌంటింగ్ కోసం 14 టేబుల్స్ ఏర్పాటు చేయాల్సి ఉంటుందనీ, ఒక్కో టేబుల్ వద్ద 16 మంది కౌంటింగ్ ఏజెంట్లు ఉంటారన్నారు. ఇలా ఒక్క కౌంటింగ్ కేంద్రంలో 200 మంది ఉండాలన్నారు. కానీ ఇప్పుడు ఏర్పాటుచేసిన కేంద్రంలో కనీసం 4-5 ఉండటానికి కూడా వీలు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కనీసం పక్కకు వెళ్లేందుకు కూడా అవకాశం లేదనీ, దీనివల్ల శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కౌంటింగ్ హాల్ సామర్థ్యం పెంచాలని డిమాండ్ చేశారు. తన 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ఏర్పాట్లు ఎప్పుడూ చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ఈసారి కూడా 2014 నాటి ఫలితాలే పునరావృతం అవుతాయని పయ్యావుల కేశవ్ జోస్యం చెప్పారు. అప్పట్లో కూడా జగనే గెలుస్తాడని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయనీ, కానీ ప్రజలు మాత్రం టీడీపీకే పట్టం కట్టారని గుర్తుచేశారు.