Andhra Pradesh: ‘నువ్వు నా దగ్గర పాలేరులా, జీతగాడిలా పనిచేయాలి’ అని మైహోం రామేశ్వరరావు అవమానించారు!:టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్
- టీవీ9 వదిలివెళ్లేలా చేస్తానని బెదిరించారు
- తొలుత మేఘా కృష్ణారెడ్డి ఛానల్ కొంటామన్నారు
- వీడియో విడుదల చేసిన టీవీ9 మాజీ సీఈవో
టీవీ9లో ఏం జరుగుతోంది? రవిప్రకాశ్ పరిస్థితి ఏంటి? అని రోజూ తనకు చాలా సందేశాలు వస్తున్నాయని టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ తెలిపారు. ఈరోజు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. అందులో మాట్లాడుతూ.. ‘టీవీ9 సంస్థను 15 సంవత్సరాల క్రితం నేను ప్రారంభించాను. నాకు బయట నుంచి ప్రైవేటు ఈక్విటీ ప్లేయర్ గా శ్రీనిరాజు వచ్చి మద్దతు ఇచ్చారు.
ఆర్థికంగా ప్రోత్సాహం ఇచ్చారు. దేశంలో చాలా ఛానల్స్ నష్టాల్లో ఉన్నప్పుడు కూడా లాభాల బాటలో నడిచింది. నిష్పాక్షికమైన జర్నలిజం చేసింది. అయితే శ్రీనిరాజు తాను పెట్టుబడులు పెట్టి చాలా రోజులు అయిందనీ, లాభాలతో బయటకు వెళతానని చెప్పారు. అందుకు అంగీకరించిన నేను చాలామందిని కలిశాను’ అని రవిప్రకాశ్ తెలిపారు.
తాను ఒక్క రూపాయి లాభం ఆశించకుండానే ఈ డీల్ చేసేందుకు రంగంలోకి దిగానని రవిప్రకాశ్ అన్నారు. ‘‘ఈ క్రమంలో నాకు మేఘా కృష్ణారెడ్డి అనే వ్యక్తి కలిశారు. నాతో పాటు నలుగురు చెరో 20 శాతం పెట్టుబడి పెడతాం. రవిప్రకాశ్ కు పూర్తి ఆపరేషనల్ స్వేచ్ఛ ఇస్తాం అని హామీ ఇచ్చారు. శ్రీనిరాజు లాభాలతో బయటపడ్డారు. కానీ నేను ఆశించింది ఒకటి.. వాస్తవంలో జరిగింది మరొకటి.
మేఘా కృష్ణారెడ్డి స్థానంలో మైహోమ్ రామేశ్వరావు మెజారిటీ వాటాలను కొనుగోలు చేశారు. ఈ విషయమై రామేశ్వరరావుతో మాట్లాడాను. నేను మైనారిటీ షేర్ హోల్డర్ ను కాబట్టి మెజారిటీ షేర్ హోల్డర్ తో ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుందని చెప్పాను.
దీంతో రామేశ్వరావు స్పందిస్తూ.. ‘మాది కుటుంబ వ్యాపారం. నువ్వు మైనారిటీ షేర్ హోల్డర్ అయినా మేం ఎలాంటి ఒప్పందం చేసుకోం. నువ్వు మా దగ్గర ఓ జీతగాడిలా, పాలేరులా పనిచేయాల్సి ఉంటుంది. నువ్వు టీవీ9 వదిలి వెళ్లేలా నేను చూస్తాను. ఇందుకోసం ఎలాంటి ఇబ్బందులకైనా గురిచేస్తాను అని బెదిరించారు’’ అని రవిప్రకాశ్ వీడియోలో తెలిపారు.