Uganda: ఆఫ్రికాలో మహాతల్లి!... 44 మందికి జన్మనిచ్చింది!
- ఉగాండాలో ఘటన
- కవలలే ఎక్కువ
- రెండేళ్ల క్రితమే కుటుంబ నియంత్రణ సర్జరీ
ఈరోజుల్లో ఇద్దరి కంటే ఎక్కువ మంది బిడ్డలు ఉంటే వారిని పెంచడం ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. అలాంటిది 44 మంది పిల్లలకు జన్మనిచ్చిన ఓ ఆఫ్రికా మహిళ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఆమె పేరు మరియం నబతాంజీ. ఉగాండా దేశానికి చెందిన మరియం జన్యుస్థితి ఆమెకు అసాధారణమైన రీతిలో సంతానాన్ని అందించింది. కేవలం 12 ఏళ్ల వయసులోనే పెళ్లిచేసుకున్న మరియం గత ఇరవై ఏళ్ల వ్యవధిలో అనేకమంది కవలలకు జన్మనిచ్చింది. దాంతో ఆమె సంతానం ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయింది.
ఆమె గర్భాశయం పెద్దదిగా ఉండడం వల్లే కవలలు జన్మిస్తున్నట్టు వైద్యనిపుణులు చెబుతున్నారు. కుటుంబ నియంత్రణ మాత్రలు వేసుకుంటే ఆరోగ్యం దెబ్బతింటుందన్న ఉద్దేశంతో ఆమె పిల్లల్ని కనడానికే ప్రాధాన్యతనిచ్చింది. తొలి సంతానమే కవలలు కావడంతో మొదట్లో మురిసిపోయినా, ఆపై వరుసగా కవలలు కలగడంతో వారిని పెంచడానికి మరియం తీవ్ర అవస్థలు పడుతోంది.
తన కుటుంబానికి ఓ పూట భోజనం పెట్టాలంటే ఆమెకు 25 కేజీల జొన్న పిండి అవసరమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో చేపలు, మాంసం వంటి ఖరీదైన ఆహారం గురించి దాదాపు మర్చిపోయిందా మహాతల్లి. ప్రస్తుతం ఆమె పిల్లల్లో ఆరుగురు చనిపోగా 38 మంది మిగిలారు.
మరియం నేపథ్యం కూడా ఎంతో బాధాకరం. ఆమె తల్లి పిల్లల్ని పెంచలేక ఆహారంలో గాజుపెంకులు కలిపి తినిపించగా, ఒక్క మరియం తప్ప మిగతా వారు చనిపోయారు. ఆ విధంగా తోబుట్టువులందరినీ కోల్పోయిన ఆమె తన పిల్లల్లో తోబుట్టువులను చూసుకుంటోంది. ఆమె అదృష్టం కొద్దీ ఎంతో రిస్క్ అయినా గానీ రెండేళ్ల క్రితం కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేశారు.