Telangana: తెలంగాణలో తొలుత పోస్టల్ బ్యాలెట్లు.. తర్వాతే అసలు ఓట్ల లెక్కింపు మొదలు
- 8 గంటలకు పోస్టల్ ఓట్ల లెక్కింపు
- 8:20 గంటలకు ఈవీఎం లెక్కింపు ప్రారంభం
- నిజామాబాద్‌లో 36 టేబుళ్ల ఏర్పాటు
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మరికాసేపట్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రజత్ కుమార్ తెలిపారు. మొత్తం 35 కేంద్రాల్లో లెక్కింపు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభించి తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తామని, అనంతరం 8:20 గంటలకు ఈవీఎంల లెక్కింపు మొదలవుతుందని వివరించారు.
ఇక, దేశం మొత్తం దృష్టిని ఆకర్షించిన నిజామాబాద్ బరిలో మొత్తం 185 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇక్కడ లెక్కింపు ఆలస్యం కాకుండా ఉండేందుకు 36 టేబుళ్ల ఏర్పాటుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చినట్టు రజత్ కుమార్ తెలిపారు. మిగిలిన నియోజకవర్గాల్లో మాత్రం 14 టేబుళ్ల ద్వారా లెక్కింపు చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించిన తర్వాతే తుది ఫలితాన్ని వెల్లడించనున్నట్టు తెలిపారు.