Andhra Pradesh: ఏపీ అసెంబ్లీ కౌంటింగ్... తొలి ఫలితం వెల్లడయ్యే నియోజకవర్గం ఇదే!
- తొలుత వెల్లడికానున్న నర్సాపురం ఫలితం
- చివర్లో రానున్న రాజమహేంద్రవరం రూరల్, రంపచోడవరం
- 12 నుంచి 37 రౌండ్ల పాటు కొనసాగనున్న కౌంటింగ్
మరికొన్ని నిమిషాల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుండగా, పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గ ఫలితం తొలుత విడుదలయ్యే అవకాశాలున్నాయని అధికారులు అంటున్నారు. నర్సాపురం పరిధిలో అతి తక్కువ పోలింగ్ కేంద్రాలున్నాయని, కేవలం 12 నుంచి 13 రౌండ్ల ఓట్ల లెక్కింపుతోనే తుది ఫలితం వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇక ఇదే సమయంలో రాజమహేంద్రవరం రూరల్, రంపచోడవరం నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపునకు 36 నుంచి 37 రౌండ్ల పాటు ఓట్లను లెక్కించాల్సి వస్తుందని, ఈ నియోజకవర్గాల్లో ఫలితాలు చిట్టచివర వెలువడతాయని చెబుతున్నారు.
కాగా, 13 నుంచి 17 రౌండ్ల లెక్కింపుతో ఫలితం తేలే నియోజకవర్గాల్లో ఆచంట, కొవ్వూరు (ఎస్సీ), పాలకొల్లు, మచిలీపట్నం, ఏలూరు, బాపట్ల, నెల్లూరు సిటీ, తాడేపల్లిగూడెం, నిడదవోలు, పెడన, చీరాల, మండపేట, చిత్తూరు, ఉంగుటూరు, గుంటూరు ఈస్ట్, నెల్లూరు రూరల్, ప్రత్తిపాడు, అనపర్తి, నగరి, పార్వతీపురం, వేమూరు, మాడుగుల, విశాఖపట్నం సౌత్, విశాఖపట్నం వెస్ట్ నియోజకవర్గాలు ఉన్నాయి.
ఇక 30 నుంచి 37 రౌండ్ల లెక్కింపు అవసరమయ్యే నియోజకవర్గాల్లో రాజమహేంద్రవరం రూరల్, రంపచోడవరం, జగ్గంపేట, అమలాపురం, పాణ్యం, నందిగామ, రాజమహేంద్రవరం నగరం, తుని, పెద్దాపురం, గన్నవరం(ఎస్సీ), రాజానగరం, కాకినాడ నగరం నియోజకవర్గాలున్నాయి. మిగతా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ 18 నుంచి 29 రౌండ్లలో కౌంటింగ్ పూర్తికానుంది.