Rajasthan: కలిసి ప్రయాణించినా పలకరింపు కరువు... విమానంలో ఎడమొహం పెడమొహంగా అశోక్ గెహ్లట్, వసుంధరారాజే
- ఢిల్లీ నుంచి జైపూర్‌కు ప్రయాణించిన సీఎం, మాజీ సీఎం
- దిగాక ఇద్దరూ వేర్వేరు గేట్ల నుంచి నిష్క్రమణ
- చర్చనీయాంశంగా మారిన నేతల తీరు
నిన్నమొన్నటి వరకు ఒకరు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి. మరొకరు ప్రస్తుత ముఖ్యమంత్రి. పలుసందర్భాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు, పలకరింపులు వారి మధ్య షరా మామూలే. అటువంటి నేతలు ఇద్దరూ ఒకే విమానంలో ప్రయాణించినా కనీసం మర్యాదకు కూడా పలకరించుకోకపోవడం, విమానం దిగేటప్పుడు కూడా వేర్వేరు మార్గాల్లో ఎవరి మానాన వారు వెళ్లిపోవడం చూపరులకు ఆశ్చర్యం కలిగించింది.
ఇంతకీ ఆ నేతలెవరనుకుంటున్నారా...రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్, మాజీ ముఖ్యమంత్రి వసుంధరరాజే. నిన్న ఇద్దరు నేతలు ఢిల్లీ నుంచి ఒకే విమానంలో జైపూర్‌కు ప్రయాణించినా ఒకరినొకరు పలకరించుకోలేదు. ఇదే విషయాన్ని అశోక్ గెహ్లట్ వద్ద ప్రస్తావించగా ‘వసుంధర బిజినెస్ క్లాస్‌లో ఉన్నట్టున్నారు. నేను ఎకానమీ క్లాస్‌లో ఉన్నాను. నేనైతే ఆమెను గమనించలేదు. గమనించి ఉంటే కచ్చితంగా నేనే వెళ్లి పలకరించే వాడిని’ అని సమర్థించుకున్నారు.