Bhuvanagiri: కారు గెలుపుకు 'రోడ్ రోలర్' బ్రేక్... పెద్దగా తెలియని అభ్యర్థికి 27 వేల ఓట్లు!
- భువనగిరిలో 5,219 ఓట్ల తేడాతో కోమటిరెడ్డి విజయం
- ఇండిపెండెంట్ అభ్యర్థి సింగపాక లింగంకు రోడ్ రోలర్ గుర్తు
- అనూహ్యంగా 27 వేల ఓట్లకు పైగా పొందిన లింగం
తెలంగాణలోని భువనగిరి లోక్ సభ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 5,219 ఓట్ల స్వల్ప మెజారిటీతో టీఆర్ఎస్ తరఫున బరిలోకి దిగిన బూర నర్సయ్య గౌడ్ పై విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక్కడ వీరిద్దరూ కాకుండా మరో 9 మంది బరిలో నిలిచారు.
ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్ ఓడిపోవడానికి, ఇండిపెండెంట్ గా నిలిచి, రోడ్ రోలర్ గుర్తుతో పోటీ చేసిన సింగపాక లింగం అనే వ్యక్తి కారణమని ఆ పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. ఎవరికీ పెద్దగా తెలియని లింగంకు ఏకంగా 27,973 ఓట్లు పోల్ కావడమే ఇందుకు కారణం. భువనగిరి పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 12,12,631 ఓట్లు పోల్ కాగా, కోమటిరెడ్డికి 5,32,795 ఓట్లు, నర్సయ్య గౌడ్ కు 5,27,576 ఓట్లు వచ్చాయి. రోడ్ రోలర్, కారు గుర్తులు ఒకేలా కనిపిస్తుండటంతో, పలువురు కారు అనుకుని రోడ్ రోలర్ కు ఓటేశారని, అదే తమ అభ్యర్థి పరాజయానికి కారణమైందని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు.