Andhra Pradesh: ‘జగన్ వైఎస్ కంటే స్ట్రాంగ్ ఫెలో.. ఎప్పటికైనా అడ్డుపడతాడు’ అన్న భయంతో చంద్రబాబు తప్పుడు కేసులు వేయించారు!: పోసాని ఆగ్రహం
- జగన్ ను గూండా, రౌడీ, వాడు, వీడు అన్నారు
- అవినీతిపరుడని మీడియాలో రాయించారు
- న్యాయం ఉంది కాబట్టే జగన్ కు బెయిల్ వచ్చింది
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జగన్ పై చాలా తప్పుడు కేసులు పెట్టించారని ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళీ ఆరోపించారు. జగన్ ను ఎన్నికల ప్రచారం సందర్భంగా వాడు, వీడు, గూండా, రౌడీ అని సంబోధించారని పోసాని గుర్తుచేశారు. తన మనుషులతో జగన్ అవినీతిపరుడు అని చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేశారనీ, మీడియా సాయంతో అప్రతిష్టపాలు చేశారని విమర్శించారు. ఇప్పుడు ఎన్నికల తర్వాత ‘జగన్ గారిని అభినందిస్తున్నా’ అని చంద్రబాబు చెప్పారనీ, ప్రజాతీర్పును చూసి ఆయన మారి ఉంటారని భావిస్తున్నట్లు వ్యాఖ్యానించారు.
జగన్ పై చంద్రబాబు, కాంగ్రెస్ పెట్టించినవి తప్పుడు కేసులు అని ప్రజలు నమ్మారని పోసాని తెలిపారు. ‘వీడు(జగన్) ఎప్పటికైనా అడ్డుపడతాడు. ఈ పిల్లవాడు. వైఎస్ రాజశేఖరరెడ్డి కంటే స్ట్రాంగ్ ఫెలో.. అని మీరు కుట్ర పన్ని మీ పార్టీ(టీడీపీ) వాళ్లతో ఓ కేసు వేయించారు. కాంగ్రెస్ మీ మిత్రపక్షం కాబట్టి ఆ పార్టీకి చెందిన ఓ నాయకుడితో దగ్గర ఉండి కేసు వేయించి జైలుకు పంపించారు.
దేవుడు ఉన్నాడు. న్యాయస్థానాలు ఇంకా న్యాయం చెబుతున్నాయి. ప్రజల పక్షాన ఉంటున్నాయి. అందుకే జగన్ కు బెయిల్ ఇచ్చి పంపించాయి. ఈ కేసులను చంద్రబాబు వెనక్కి తీసుకోవాలి. అప్పుడే నేను మిమ్మల్ని(చంద్రబాబును) మనిషిగా గుర్తిస్తాను. ఇకపై ఈ కుట్రలు చేయొద్దు, కుతంత్రాలు చేయవద్దు’ అని హితవు పలికారు.