Andhra Pradesh: విశాఖ ఉత్తరంలో టీడీపీ జయభేరి.. 1,902 ఓట్లతో విజయం సాధించిన గంటా శ్రీనివాసరావు!
- రెండో స్థానంలో వైసీపీ నేత కేకే రాజు
- నిన్న తెరుచుకోని ఐదు ఈవీఎంలు
- ఆందోళనకు దిగిన వైసీపీ, రీపోలింగ్ కు డిమాండ్
ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ ఉత్తరం అసెంబ్లీ నియోజకవర్గం ఫలితాల ప్రకటనపై కొనసాగుతున్న సందిగ్ధత వీడింది. ఈ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు 1,902 ఓట్లతో విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. వైసీపీ అభ్యర్థి కేకే రాజు ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచారు. అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా నిన్న ఐదు ఈవీఎంలు తెరుచుకోలేదు.
దీంతో వీవీప్యాట్ యంత్రాల్లోని స్లిప్పులను లెక్కించాలని నిర్ణయించారు. అయితే వీటిలోని ఓ వీవీప్యాట్ మెషీన్ లో 307 వీవీప్యాట్ స్లిప్పులకు గానూ 106 మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఎన్నికల సిబ్బంది టీడీపీతో కుమ్మక్కు అయ్యారని ఆరోపిస్తూ వైసీపీ అభ్యర్థి కేకే రాజు ఆందోళనకు దిగారు. రీపోలింగ్ జరపాలని డిమాండ్ చేశారు. దీంతో ఈ విషయాన్ని ఈసీకి నివేదించిన అధికారులు, తుది ఫలితాన్ని పెండింగ్ లో పెట్టారు.