Kamal Haasan: సార్వత్రిక ఎన్నికల్లో కమలహాసన్ పార్టీ పరిస్థితి ఇదీ!
- అన్నింటా పోటీచేసిన ఎంఎన్ఎం
- ఒక్కచోటా గెలవని వైనం
- తన పార్టీ 15 నెలల పసికందు అన్న కమల్
ప్రముఖ నటుడు కమలహాసన్ స్థాపించిన మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో చేదు ఫలితాలు చవిచూసింది. తమిళనాడులో 22 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికతో పాటు 38 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా, ఎంఎన్ఎం అన్ని స్థానాల్లో అభ్యర్థులను బరిలో దించింది. అయితే, ఒక్క స్థానంలోనూ ఆ పార్టీకి విజయం దక్కలేదు సరికదా, చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు కూడా పడలేదు.
దీనిపై కమలహాసన్ మాట్లాడుతూ, తన ఎంఎన్ఎం పార్టీ కేవలం 15 నెలల పసికందు అని అభివర్ణించారు. పార్టీపై ప్రజలు నమ్మకం ఏర్పరచుకోవడానికి తగినంత సమయం లేకపోయిందని అన్నారు. ఈ ఎన్నికల్లో ఎంఎన్ఎంకు ఓటేసిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు చెప్పారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ దేశవ్యాప్తంగా భారీ విజయం సాధించడం అనేది ప్రజాతీర్పు అని, అయితే, అదే ఎన్డీఏ తమిళనాట ఒక్కస్థానంలో గెలవడం కూడా ప్రజల వైఖరిగానే భావించాలని తెలిపారు.