siddaramaiah: కర్ణాటక సీఎం సంచలన నిర్ణయం.. రాజీనామాకు సిద్ధమైన కుమారస్వామి?
- దేవెగౌడ నివాసంలో గంటన్నరకు పైగా రహస్య సమావేశం
- ఆవేశంలో నిర్ణయాలు వద్దన్న దేవెగౌడ
- సంకీర్ణ ప్రభుత్వం పూర్తికాలం కొనసాగుతుందన్న సిద్ధరామయ్య
కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి రాజీనామాకు సిద్ధమైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో అధికార కూటమికి చావుదెబ్బ తగలడంతో ఆయనీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రాజీనామా నిర్ణయాన్ని తన తండ్రి, మాజీ ప్రధాని దేవెగౌడకు చెప్పారని, ఆయన వారించారని సమాచారం. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్‌లు చెరో స్థానంలో విజయం సాధించాయి. బీజేపీ అనూహ్యంగా 25 స్థానాలను కైవసం చేసుకుంది.
ఓటమి అనంతరం శుక్రవారం ఉదయం కాంగ్రెస్-జేడీఎస్ కూటమి నేతలు సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. దేవెగౌడ నివాసంలో గంటన్నరకుపైగా జరిగిన రహస్య సమావేశంలో కుమారస్వామి రాజీనామా ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే, కుమారుడిని దేవెగౌడ వారించారని, ఆవేశంలో నిర్ణయాలు కూడదని హితవు పలికారని సమాచారం.
కాదు, కూడదని కుమారస్వామి రాజీనామాకు సిద్ధపడితే డిప్యూటీ సీఎంగా ఉన్న కాంగ్రెస్ నేత పరమేశ్వరన్‌ను సీఎం చేయాలని దేవెగౌడ ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు, సమన్వయ కమిటీ అధ్యక్షుడు సిద్ధరామయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏమీ లేదని, పూర్తికాలం కొనసాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.