Andhra Pradesh: పోలీసులు నన్ను చాలా దారుణంగా హింసించారు: జగన్ పై దాడి కేసు నిందితుడు శ్రీనివాస్
- గత ఏడాది అక్టోబర్ 25న విశాఖ ఎయిర్ పోర్టులో దాడి
- ఏడు నెలల అనంతరం బెయిల్ పై శ్రీనివాస్ విడుదల
- చుట్టూవున్నా వాళ్లు కొడుతుంటే జగన్ వారించారు
గత ఏడాది అక్టోబర్ 25న విశాఖపట్టణం ఎయిర్ పోర్టులో వైసీపీ అధినేత జగన్ పై దాడి జరిగిన విషయం తెలిసిందే. నిందితుడు శ్రీనివాస్ కు ఇటీవల బెయిల్ లభించింది. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న శ్రీనివాస్ ఏడు నెలల రిమాండ్ అనంతరం బెయిల్ పై ఈరోజు విడుదలయ్యాడు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ ను పలకరించిన మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఎయిర్ పోర్టులోని హోటల్ లో చెఫ్ గా పనిచేస్తున్నానని, ఆరోజున ప్రజా సమస్యలపై జగన్ తో మాట్లాడేందుకు ఆయన వద్దకు వెళ్లినప్పుడు తన చేతిలో ఉన్న కత్తి ఆయనకు తగిలిందని అన్నాడు. కంగారులో, పొరపాటున తన చేతిలో కత్తి ఆయనకు గుచ్చుకున్న మాట వాస్తవమేనని స్పష్టం చేశాడు. తన చేతిలో నైఫ్ వుండగా, ఫోర్క్, ఒక పెన్ కూడా ఆ సమయంలో తన జేబులో ఉన్నాయని, అవన్నీ చిందరవందరగా పడిపోయాయని చెప్పాడు. జగన్ కు ఏం తగిలిందో అన్న విషయం కూడా తనకు తెలియదని పేర్కొన్నాడు.
ఈ సంఘటన తర్వాత తనను అక్కడి వాళ్లు కొడుతుంటే కొట్టొద్దని వాళ్లకు జగన్ చెప్పారని, పోలీసులు తనను వారి అధీనంలోకి తీసుకున్నారని గుర్తుచేసుకున్నాడు. ‘పోలీసులు నన్ను చాలా దారుణంగా హింసించారు. ఏ టెస్టులు అయినా చేసుకోండి, అవసరమైతే చంపేయండి. నేను ఏ తప్పూ చేయలేదు’ అని పోలీసులకు చెప్పేవాడినని శ్రీనివాస్ చెప్పుకొచ్చాడు.