Spain: బెడ్ రూం గోడలో భరించలేని శబ్దం... పగులగొట్టి చూస్తే...!
- స్పెయిన్ లో ఘటన
- ఇంట్లో వింత శబ్దాలు
- హడలిపోయిన జంట
స్పెయిన్ లోని ఆండలూసియా ప్రాంతంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. గ్రనడా సిటీలో నివసించే ఓ జంటకు విచిత్రమైన సమస్య ఎదురైంది. కొన్నాళ్లుగా తమ బెడ్ రూంలో విచిత్ర శబ్దాలు వినిపిస్తుండడంతో వారు భయకంపితులయ్యారు. ప్రధానంగా ఓ గోడలోంచి ఆ శబ్దాలు వస్తున్నట్టు గుర్తించి, అందులో ఏముందోనని హడలిపోయారు.
మొదట్లో ఆ సౌండ్ ను పక్కింటివాళ్ల వాషింగ్ మెషీన్ నుంచి వస్తున్న ధ్వనిగా భావించారు. కొన్నాళ్లు ఏసీ యంత్రం నుంచి వస్తున్న రొద అని అనుకున్నారు. కొన్నిరోజులుగా ఆ ధ్వనులు మరింత తీవ్రతరం కావడంతో తట్టుకోలేక అగ్నిమాపక దళానికి ఫిర్యాదు చేశారు.
రంగంలోకి దిగిన ఫైర్ ఫైటర్స్ ఆ గోడను పగులగొట్టి చూడగా, నమ్మశక్యంకాని రీతిలో భారీ సంఖ్యలో తేనెటీగలు దర్శనమిచ్చాయి. అవి ఆ గోడలోకి ఎలా ప్రవేశించాయో వారికి అర్థంకాలేదు. సుమారు 80,000 తేనెటీగలు ఒక్కసారిగా ఝుంకారం చేయడం ద్వారా విచిత్ర శబ్దాలు ఉత్పత్తి అయినట్టు ఫైర్ ఫైటర్స్ వివరించారు. మొత్తమ్మీద ఆ స్పానిష్ జంటకు పెద్ద బాధ తీరినట్టయింది.