Jagan: జగన్ కు పరిపాలన విషయంలో కీలక సూచనలు చేసిన జయప్రకాశ్ నారాయణ
- జగన్ కు విషెస్ చెప్పిన జేపీ
- ఏపీకి రూ.80 వేల కోట్లు రావాలి
- కేంద్రం ఇవ్వకపోతే పన్నుల్లో సర్దుబాటు చేసుకోండి
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించడం పట్ల లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ స్పందించారు. వైసీపీ అధినేత, కాబోయే ముఖ్యమంత్రి జగన్ కు శుభాకాంక్షలు చెప్పిన జేపీ ఈ సందర్భంగా కీలక సూచనలు చేశారు. కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చే క్రమంలో ఎలా వ్యవహరించాలో చెప్పారు. కేంద్రం నుంచి నిధులు రాని పక్షంలో మనం చెల్లించే పన్నులను రాష్ట్రంలోనే వినియోగించుకునేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని వివరించారు.
కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.80,000 కోట్లు రావాల్సి ఉందని, అధికారం చేపట్టిన వెంటనే ఈ అంశంపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. విద్య, వైద్యం వంటి ప్రాథమిక హక్కుల విషయంలో జగన్ ప్రత్యేక శ్రద్ధ చూపాలని జేపీ సూచించారు. ఎన్నికల్లో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి అంశాల ఊసేలేదని, కానీ, కులాల పేరిట సమాజ విభజన స్పష్టంగా కనిపించిందని అన్నారు. ఇలాంటి లోటుపాట్లను జగన్ పట్టించుకోవాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.