election commission: రాష్ట్రపతికి కొత్త ఎంపీల జాబితాను అందజేసిన ఎలక్షన్ కమిషన్
- రాష్ట్రపతిని కలసిన ఎలక్షన్ కమిషనర్లు
- 17వ లోక్ సభ ఏర్పాటు ప్రక్రియ మొదలు
- మోదీని ఆహ్వానించాలని కోరనున్న ఎన్డీయే
సార్వత్రిక ఎన్నికల ఫలితాల తరువాత, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రక్రియకి సంబంధించిన పనులు చకచకా జరిగిపోతున్నాయి. అందులో భాగంగానే ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ ఆరోరా, కమిషనర్లు అశోక్ లావాసా, సుశీల్ చంద్ర కలసి నేడు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలుసుకున్నారు.
నిబంధనల మేరకు ఎన్నికల కమిషన్ జారీ చేసిన నోటిఫికేషన్ కాపీని .. సార్వత్రిక ఎన్నికల్లో ఎంపికైన కొత్త ఎంపీల జాబితాను ఆయనకి అందజేశారు. రాజ్యాంగం ప్రకారం 17వ లోక్ సభ ఏర్పాటు ప్రక్రియకు సంబంధించి చొరవ తీసుకునేందుకు ఈ జాబితా రాష్ట్రపతికి ఉపయోగపడనుంది. ఎన్డీయేలో కొత్తగా ఎన్నికైన ఎంపీలంతా కలిసి ఈ రోజు సాయంత్రం సమావేశమై, నరేంద్ర మోదీని తమ నేతగా ఎన్నుకోనున్నారు. బీజేపీ దాని మిత్రపక్ష ప్రతినిధులంతా రాష్ట్రపతిని కలిసి, నరేంద్రమోదీ ప్రధాన మంత్రి బాధ్యతలు చేపడతారనీ, ప్రభుత్వ ఏర్పాటుకు ఆయనను ఆహ్వానించాలని కోరనున్నారు.