Jana Reddy: తాజా లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్కు బుద్ధి చెప్పారు: జానారెడ్డి
- ఫిరాయింపులను ప్రోత్సహించడం సరికాదు
- ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది
- హుజూర్నగర్ నుంచి పోటీ చెయ్యను
88 అసెంబ్లీ స్థానాలను గెలిచిన టీఆర్ఎస్ ఫిరాయింపులను ప్రోత్సహించడం సరికాదని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమంపై దృష్టి సారించడం మాని, ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందన్నారు.
తాను పార్లమెంట్‌కు పోటీ చేస్తానంటే కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం తనకు టికెట్ కేటాయించేదని, కానీ తానెప్పుడూ పదవుల కోసం ఆశపడలేదన్నారు. తాజా లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్కు బుద్ధి చెప్పారన్నారు. ఈ ఫలితాలను దృష్టిలో పెట్టుకునైనా ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నారు. ఉత్తమ్ ఎంపీగా ఎన్నిక అవడంతో జరిగే హుజూర్నగర్ శాసనసభ ఉప ఎన్నికలలో తాను పోటీ చేయబోనన్నారు.