Bihar: అన్నపానీయాలు మానేసిన లాలూ ప్రసాద్ యాదవ్!
- మోదీ సునామీలో కొట్టుకుపోయిన ఆర్జేడీ
- బీహార్ లో ఒక్కస్థానం కూడా దక్కని వైనం
- లాలు ఆరోగ్యంపై వైద్యుల ఆందోళన
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. పాట్నాలోని రిమ్స్ హస్పిటల్ లో ఆయన వైద్య సేవలు అందుకుంటున్నారు. కాగా, ఎన్నికల్లో ఆర్జేడీ చిత్తుగా ఓడిపోయింది. బీహార్ లో మొత్తం 40 లోక్ సభ స్థానాలు ఉండగా ఎన్డీయే కూటమి 39 స్థానాల్లో జయభేరి మోగించింది. ఆర్జేడీకి ఒక్క స్థానం కూడా దక్కలేదు.
ఈ నేపథ్యంలో, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లాలూ ప్రసాద్ యాదవ్ గత రెండ్రోజులుగా అన్నపానీయాలు ముట్టడంలేదని వైద్యులు తెలిపారు. ఆయన దైనందిన కార్యక్రమాలు మారిపోయాయని, అన్నం తినడంలేదని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఆహారం తీసుకుంటేనే తాము ఔషధాలు ఇవ్వగలమని చెప్పినా లాలూలో మార్పు రావడంలేదని ఆందోళన వ్యక్తం చేశాయి.
ఆయన ఆర్జేడీ ఓటమిపై మనస్తాపంతోనే ఆహారం తీసుకోవడం మానేశారా? అనేది చెప్పలేమని డాక్టర్లు వ్యాఖ్యానించారు. మరోవైపు ఆయన్ను కలిసేందుకు ఆసుపత్రికి వచ్చిన ఆర్జేడీ నేతలు మాత్రం తమ అధినేత ఇలాంటి ఎన్నికలు ఎన్నో చూశారని, ఫలితాలు ఆయనపై ప్రభావం చూపబోవని ధీమా వ్యక్తం చేశారు.