kcr: రాయలసీమ ఇక రత్నాలసీమే... జగన్ కు మాస్టర్ ప్లాన్ చెప్పిన కేసీఆర్!
- రెండు ఎత్తిపోతల పథకాలు అమలు చేస్తే చాలు
- ప్రకాశం బ్యారేజ్ కి గోదావరి జలాలు
- రాయలసీమను సస్యశ్యామలం చేద్దాం
- కేసీఆర్ ఆలోచనకు ఓకే చెప్పిన జగన్!
రాయలసీమ ప్రాంతాన్ని రత్నాల సీమగా మార్చేందుకు కేసీఆర్ ఓ మాస్టర్ ప్లాన్ ను జగన్ కు చెప్పినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. కేవలం రెండు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను నిర్మించుకుంటే, గోదావరి నీటిని సీమకు తరలించవచ్చని, తద్వారా సీమ మొత్తం సస్యశ్యామలం అవుతుందని కేసీఆర్ తన మనసులోని మాటను చెప్పగా, జగన్ ఎంతో ఆశ్యర్యపోయినట్టు సమాచారం.
ప్రతి సంవత్సరమూ గోదావరి నదిలో 3,500 టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తోందని గుర్తు చేసిన ఆయన, వాటన్నింటినీ వాడుకునే పరిస్థితి లేదని, సుమారు 800 టీఎంసీలను మాత్రమే తెలంగాణ వాడుకోగలదని, మిగతా నీటినంతటినీ ఏపీ వాడుకునే వీలుందని కేసీఆర్ తన మనసులోని మాటను చెప్పారు. అందుకోసం ప్రకాశం బ్యారేజ్ ద్వారా సోమశిల వరకూ గ్రావిటీ ద్వారా గోదావరి నీటిని పంపుకునే ప్లాన్ తన వద్ద ఉందని చెప్పారు. గోదావరి నీటితోనే రాయలసీమను సస్యశ్యామలం చేయవచ్చని, మిగులు కృష్ణా జలాలు మిగతా ప్రాంతానికి వరదాయకమని ఆయన అన్నారు.
నిన్న తనను కలిసిన ఏపీ కాబోయే సీఎం జగన్ కు ఆత్మీయ స్వాగతాన్ని పలికి, స్నేహహస్తం అందించిన కేసీఆర్, ఏపీతో సత్సంబంధాలనే తాను కోరుకున్నానని, పక్క రాష్ట్రాలతో ఇచ్చిపుచ్చుకునే ధోరణివైపే తాను మొగ్గు చూపుతానని స్పష్టం చేశారు. ఏపీతోనూ ఇదే విధమైన మార్గంలో వెళతామని, రెండు రాష్ట్రాలకూ లాభాన్ని చేకూర్చే కృష్ణా, గోదావరి జలాలను సమర్థవంతంగా వినియోగించుకోవాల్సి వుందని అభిప్రాయపడ్డారు.
తాను మహారాష్ట్రతో మంచిగా ఉండబట్టే కాళేశ్వరం తదితర ప్రాజెక్టులను నిర్మించుకోగలుగుతున్నానని జగన్ కు చెప్పిన కేసీఆర్, ఎన్ని ఎక్కువ ప్రాజెక్టులు ఉంటే అన్ని నీళ్లను నిల్వ చేసుకోవచ్చని జగన్ కు సూచించారు. తెలుగువారందరికీ మేలు కలిగేలా వ్యవహరిద్దామని అన్నారు. అతి త్వరలోనే నీటి పారుదల శాఖలో ఉన్న ఉన్నతాధికారులతో కలిసి సమావేశమై మిగతా విషయాలను చర్చిద్దామని కేసీఆర్ సూచించగా, జగన్ అందుకు అంగీకరించారు.