Police: తనను కాదన్న స్నేహితురాలి పరువు తీయాలని చూసి కటకటాల వెనక్కు!

  • ఒకే కాలేజీలో చదువుకున్న బాధితురాలు, నిందితుడు
  • ఆ సమయంలో వాట్స్ యాప్ గ్రూప్
  • ప్రేమిస్తున్నానని వెంటపడి, ఆపై తప్పుడు ఖాతా తెరచి వేధింపులు

తనను కాదన్నదన్న ఆగ్రహంతో స్నేహితురాలి పరువు తీయాలని చూసిన ఓ యువకుడు కటకటాలపాలయ్యాడు. ఖమ్మం పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, ఖమ్మం, నిజాంపేట, ఆదిత్య థియేటర్‌ ప్రాంత వాసి నర్సింగం నవీన్‌ కుమార్‌ (23), సన్‌ డయాగ్నస్టిక్స్‌ లో ఉద్యోగం చేస్తున్నాడు. గతంలో కొత్తగూడెం జేవీఎస్ చైతన్య కళాశాలలో ఇంటర్‌ చదివాడు. ఆ సమయంలో కాలేజీ విద్యార్థులతో ఓ వాట్స్ యాప్ గ్రూప్ ప్రారంభించాడు. దానిలో తన స్నేహితురాలిని అడ్మిన్ గా చేశాడు.

ఆపై ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానని ప్రతిపాదించాడు. ఆమె అంగీకరించకపోవడంతో, అనుచిత వ్యాఖ్యలతో పోస్ట్‌ లు పెట్టాడు. దీంతో నవీన్ ను గ్రూపు నుంచి తొలగించగా, ఆమెపై ఆగ్రహంతో వాట్సాప్‌ కు మెసేజ్‌ లు పెట్టాడు. దీంతో అతన్ని ఆమె బ్లాక్ చేసింది. దీంతో మరింతగా ఆగ్రహించిన నవీన్, ఆమె పేరిట ఫేస్ బుక్ లో ఖాతా తెరిచాడు. ఆమె చిత్రాలను పోస్ట్ చేస్తూ, డబ్బులిస్తే వీడియో చాటింగ్, న్యూడ్ వీడియోలు పంపుతానని పోస్టులు పెట్టాడు. కొందరు ఆసక్తి చూపగా, వారి నుంచి డబ్బులు వసూలు చేశాడు. ఈ విషయం బాధితురాలికి తెలియడంతో ఆమె రాచకొండ పోలీసులను ఆశ్రయించింది. కేసును దర్యాఫ్తు చేసిన పోలీసులు, నిందితుడు హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ ఉన్నాడని గుర్తించి అరెస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News