Kurnool District: కొత్త కారుకు వాహనపూజ.. బ్రేక్‌కు బదులు యాక్సిలరేటర్ తొక్కిన పూజారి.. భక్తులపైకి దూసుకెళ్లిన కారు!
- శ్రీశైలంలోని సాక్షి గణపతి ఆలయంలో ఘటన
- కొత్తకారుకు పూజలు చేస్తుండగా ప్రమాదం
- ఏడుగురు భక్తులకు గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
కొత్త కారు కొనుక్కున్న పూజారి తను విధులు నిర్వర్తిస్తున్న ఆలయంలో పూజలు నిర్వహించాడు. అనంతరం కారును వెనక్కి తీసే క్రమంలో బ్రేకుకు బదులు యాక్సిలరేటర్ నొక్కడంతో కారు ఆలయంలోని భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు భక్తులు గాయపడగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కర్నూలు జిల్లా శ్రీశైలం సాక్షి గణపతి ఆలయం వద్ద శనివారం జరిగిందీ ఘటన.
ఆలయ పూజారి సిద్ధూ ఇటీవల కొత్త కారు కొనుగోలు చేశారు. దానికి పూజలు నిర్వహించేందుకు శనివారం ఆలయానికి తీసుకొచ్చారు. పూజల అనంతరం కారును వెనక్కి తీసే క్రమంలో పొరపాటున యాక్సిలరేటర్‌ను బలంగా తొక్కడంతో కారు ఒక్కసారిగా ఆలయంలోకి దూసుకెళ్లింది. అక్కడ పూజల్లో నిమగ్నమైన భక్తుల పైనుంచి దూసుకెళ్లింది. గాయపడిన ఏడుగురిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. బాధితులను సంగారెడ్డి జిల్లాకు చెందినవారుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.