Varma: నేడు విజయవాడలో నడిరోడ్డుపై రామ్ గోపాల్ వర్మ ప్రెస్ మీట్... కొన్ని హెచ్చరికలు, మరికొన్ని సూచనలతో పోలీసుల నోటీసులు!
- బహిరంగ మీడియా సమావేశం పెట్టుకున్న వర్మ
- పైపులరోడ్డు అత్యంత ప్రధాన మార్గం
- ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతుంది
- తమకు సహకరించాలని కోరిన పోలీసులు
నేటి సాయంత్రం విజయవాడలోని పాయకాపురం, పైపులరోడ్డు జంక్షన్ లో ప్రెస్ మీట్ పెడతానని ప్రకటించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు పోలీసులు నోటీసులు పంపారు. విజయవాడ నార్త్ జోన్ ఏసీపీ రమేశ్ బాబు ఈ నోటీసులు జారీ చేస్తూ, వర్మకు కొన్ని సలహాలు ఇస్తూ, మరికొన్ని హెచ్చరికలు చేశారు. బహిరంగ ప్రదేశాల్లో సమావేశమైతే, వ్యతిరేకించేవారు అడ్డుకుని ఘర్షణలు జరగవచ్చని హెచ్చరించారు. ఈ విషయమై పునరాలోచించుకుని ప్రెస్ క్లబ్ లేదా మరేదైనా సమావేశ మందిరాన్ని ఎంచుకుంటే తమకు అభ్యంతరం లేదని సూచించారు.
నగర పరిధిలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్, 144 సెక్షన్ అమలులో ఉందని, ఎన్నికల కోడ్ కూడా అమలవుతోందని గుర్తు చేసిన ఆయన, ముందస్తు అనుమతి లేకుండా బహిరంగ ప్రదేశాల్లో సమావేశాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. పైపులరోడ్ సెంటర్ ప్రధాన మార్గమని, అత్యవసర సర్వీసులు తిరుగుతుంటాయని, మీడియా మీట్ పెడితే ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతుందని హితవు చెబుతూ, ఈ ప్రాంతంలో ఆదివారం నాడు పలు కాలేజీల్లో గ్రూప్ 1 పరీక్షలు జరగనున్నాయని, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని శాంతిభద్రతలను కాపాడేందుకు సహకరించాలని కోరారు. పోలీసుల నోటీసులపై వర్మ స్పందించాల్సి వుంది.