Andhra Pradesh: జగన్ అంటే నా తమ్ముడికి ప్రాణం.. ఎందుకో ఇప్పుడు నాకు అర్థమయింది!: దర్శకుడు పూరీ జగన్నాథ్
- మా తమ్ముడు గత ఎన్నికల్లో ఓడిపోయాడు
- కానీ జగన్ అండగా నిలిచి గెలిపించుకున్నారు
- మా కుటుంబం జగన్ కు రుణపడి ఉంటుంది
ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన వైసీపీ అధినేత జగన్ పై ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ ప్రశంసల వర్షం కురిపించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు తాను విశాఖపట్నంలో ఉన్నానని పూరి తెలిపారు. ‘విశాఖలో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి టీవీ చూస్తున్నాం. ఎందుకంటే మా తమ్ముడు ఉమాశంకర్ గణేశ్ వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. ఎన్నికలు ఎంతో టఫ్ గా ఉంటాయని ఊహించిన మాకు వార్ వన్ సైడ్ అయిపోయేసరికి మతిపోయింది.
ఏపీలో ప్రజలంతా సీక్రెట్ మీటింగ్ పెట్టుకుని జగన్ కే వేద్దాం అని కూడబలుక్కుని ఓట్లు గుద్దినట్టు అనిపించింది. ఇన్ని కోట్ల మంది ప్రజలు ఒకేసారి ఒక మనిషిని నమ్మడం, అతను తమ నాయకుడు కావాలని కోరుకోవడం చిన్న విషయం కాదు. హేట్సాఫ్ టు జగన్ మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే కొండలాంటి తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పోయిన తర్వాత తాను ఒంటరి వాడయ్యాడు.
రాజ్యం పోయింది. అందరూ మోసం చేశారు. ఎన్నో అవమానాలు. ఎన్నో కష్టాలు. ఎన్నో నెలల జైలు జీవితం. తండ్రి పేరు నిలబెట్టాలన్నా, రాజన్న రాజ్యం తీసుకురావాలన్నా మరో ఐదేళ్లు ఎదురుచూడటం. ఎంత కష్టం. జగన్ చేసింది ఒక్కరోజు ఎన్నికలు కాదు పదేళ్ల యుద్ధం. ఒళ్లంతా గాయాలతో రక్తం కారుతున్నా పట్టించుకోకుండా శక్తిని కోల్పోకుండా తన సైనికుల్లో ఉత్సాహం నింపుతూ రాజన్న ఎత్తున్న తల్వార్ ను పట్టుకుని పదేళ్ల పాటు యుద్ధరంగంలో నిలుచున్న యోధుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి’ అని పూరీ జగన్నాథ్ ట్వీట్ చేశారు.
తన తమ్ముడికి జగన్ అంటే ప్రాణమని పూరీ జగన్నాథ్ తెలిపారు. ‘జగన్ ఫొటో చూసినా, వీడియో చూసినా తెగ ఎగ్జైట్ అయిపోతాడు. ఓ సూపర్ స్టార్ లా చూస్తాడు. వాడలా ఎందుకు చూస్తాడో ఇవాళ నాకు అర్థమయింది. గత ఎన్నికల్లో నా తమ్ముడు ఓడిపోయినా మళ్లీ భుజం తట్టి చేయి పట్టుకుని యుద్ధంలోకి లాక్కెళ్లి ఇంతటి విజయాన్ని అందించిన జగన్ గారికి నేను, నా కుటుంబం రుణపడి ఉంటాం. నేను రాజకీయాల గురించి మాట్లాడటం లేదు. కానీ యోధులంటే నాకు ఇష్టం. జగన్ నాకు సింహంలా కనిపిస్తున్నారు’ అని పూరీ జగన్నాథ్ ప్రశంసల వర్షం కురిపించారు.