Vijayawada: బంగారం దుకాణం వెనుక వైపున రంధ్రం పెట్టి ఆభరణాల చోరీ
- పక్కా ప్రణాళికతో చోరీ
- ఇద్దరు వ్యక్తులు దుకాణంలోకి ప్రవేశించారు
- ఒక వ్యక్తి గ్లౌజులు, ఇతర పరికరాలు అందించాడు
విజయవాడలోని ఓ బంగారం దుకాణానికి వెనుకవైపున రంధ్రం పెట్టి దొంగలు చోరీకి పాల్పడ్డారు. వాహనాల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉండే సాయికిరణ్ జ్యూయలరీ దుకాణానికి వెనుక వైపు నిర్మిస్తున్న ఇంటి వైపు నుంచి వెనుక గోడకు రంధ్రం పెట్టి లోపలికి చొరబడ్డారు. శనివారం రాత్రి 2 నుంచి 3 గంటల మధ్య పక్కా ప్రణాళికతో ముగ్గురు వ్యక్తులు ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.
ఈ చోరీలో ఇద్దరు వ్యక్తులు లోపలికి ప్రవేశించగా మరో వ్యక్తి బయట ఉండి గ్లౌజులు, ఇతర పరికరాలు వారికి అందించినట్టు సీసీ కెమెరాల్లో నమోదైంది. సీసీ కెమెరాను తమ వెంట తీసుకొచ్చిన ఆయుధంతో పగుల గొట్టాడు. దుకాణం వెనక ఇంటి నిర్మాణం చేస్తున్న వ్యక్తి గోడకు రంధ్రం ఉండటాన్ని గమనించి యజమానికి చేరవేశాడు. దీంతో యజమాని గణేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 500 గ్రాముల బంగారం ఆభరణాలు, 15 కేజీల వెండి ఆభరణాలు చోరీకి గురైనట్టు గణేష్ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు, క్లూస్ టీమ్స్‌ను రంగంలోకి దింపాయి.