Pawan Kalyan: జగన్‌కు అభినందనలు.. జనసైనికులు విహారయాత్రకు వెళ్లి రండి: నాగబాబు
- ఎన్నికల్లో ఓడినందుకు బాధగానే ఉంది
- వెకేషన్‌కు వెళ్లి ఒత్తిడిని దూరం చేసుకోండి
- ఇది ఓటమి కాదు.. విరామం మాత్రమే
ఆంధ్రప్రదేశ్‌కు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జనసేన నేత నాగబాబు అభినందనలు తెలిపారు. తన యూట్యూబ్ చానల్ ‘మై చానల్ నా ఇష్టం’లో ఎన్నికల్లో ఓటమిపై తొలిసారి స్పందించారు. ఈ ఎన్నికల్లో నర్సాపురం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన నాగబాబు ఓటమి పాలయ్యారు. అలాగే, భీమవరం, గాజువాక అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసిన ఆ పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ రెండు చోట్లా ఓటమి పాలయ్యారు.
కాగా, ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జగన్‌కు నాగబాబు అభినందనలు తెలిపారు. ఏపీకి సుపరిపాలన అందించాలని, తమ సహకారం జగన్‌కు ఎల్లవేళలా ఉంటుందని పేర్కొన్నారు. జగన్ ఇచ్చిన నవరత్నాల హామీని ఈ ఐదేళ్లలో నిలబెట్టుకుని ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవాలన్నారు. ఇక, జనసేన ఓటమికి ఎవరూ చింతించాల్సిన పనిలేదన్న నాగబాబు.. పార్టీ గెలుపు కోసం పనిచేసిన అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. జనం క్లీన్ పాలిటిక్స్ కోరుకుంటున్నారని, తాము పైసా కూడా పంచకుండానే లక్షల ఓట్లు సాధించినట్టు చెప్పారు. జనసేన గెలవకున్నా నైతికంగా మనమే గెలిచామని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఓడిపోయినందుకు బాధగానే ఉందన్న నాగబాబు.. బాధపడడం లేదని చెప్పడం అబద్ధమే అవుతుందన్నారు.
జనసేన గెలుపు కోసం ఎన్నికల్లో పనిచేసిన వీర మహిళల బాధ చూసి తనకు నిజంగా బాధగా ఉందని, అయితే, ఇది పరాజయం మాత్రం కాదని, విరామం మాత్రమేనని అన్నారు. ఇకముందు కూడా సేవను కొనసాగిద్దామని పిలుపునిచ్చారు. జనసైనికులు అందరూ ఓ నెల రోజులు భార్య/భర్తలతో కలిసి విహారయాత్రలకు వెళ్లి రిలాక్స్ అవాలని సూచించారు. దీంతో మన నుంచి ఒత్తిడి దూరమవుతుందని నాగబాబు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఎలా ముందుకెళ్లాలన్న విషయంపై ఈలోగా పవన్ కార్యాచరణ రూపొందిస్తారని అన్నారు.