Congress: మేం సంబరాలు చేసుకోవడం ఇష్టం లేకే కాంగ్రెస్ ఈ ఘాతుకానికి పాల్పడింది: హత్యకు గురైన స్మృతి ఇరానీ సన్నిహితుడి కుమారుడు
- సురేంద్రసింగ్ను కాల్చి చంపిన దుండగులు
- ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
- కాంగ్రెస్ మద్దతుదారుల హస్తం ఉందన్న ఆయన కుమారుడు
స్మృతి ఇరానీ విజయాన్ని జరుపుకోవడం చూసి కన్నుకుట్టిన కాంగ్రెస్ నేతలే తమ తండ్రిని హత్య చేసి ఉంటారని సురేంద్ర సింగ్ కుమారుడు అనుమానం వ్యక్తం చేశాడు. స్మృతి ఇరానీ సహచరుడు సురేంద్ర సింగ్ బరూలియా గ్రామంలో శనివారం రాత్రి హత్యకు గురయ్యారు. బరూలియా మాజీ సర్పంచ్ అయిన సురేంద్రసింగ్పై ఆయన నివాసంలోనే గుర్తుతెలియని వ్యక్తులు కొందరు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన సురేంద్రసింగ్ లక్నోలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.
తన తండ్రి హత్యపై కుమారుడు అభయ్ మాట్లాడుతూ.. తండ్రి హత్య వెనక కాంగ్రెస్ మద్దతుదారుల హస్తం ఉందని అనుమానించారు. స్మృతి విజయం కోసం తన తండ్రి రాత్రీపగలు కష్టపడ్డారని అన్నారు. ఆమె గెలిచిన తర్వాత విజయ్ యాత్ర నిర్వహించినట్టు చెప్పారు. స్మృతి విజయాన్ని తాము సెలబ్రేట్ చేసుకోవడం ఇష్టం లేకే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని అభయ్ అనుమానం వ్యక్తం చేశారు.