Vidudala Rajani: రాజకీయ గురువును ఓడించి.. వెలుగులోకి వచ్చిన 'రజని'!
- అమెరికాలో ఉన్న విడుదల రజనీ
- ఏడాది క్రితం టీడీపీలో, ఆపై వైసీపీలోకి
- టికెట్ తెచ్చుకుని గురువును ఓడించిన వైనం
ఇటీవలి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తాజా మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును ఎన్నారై విడుదల రజనీ ఓడించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలకు ముందు విదేశాల్లో ఉన్న రజనిని స్వయంగా పిలిపించి, రాజకీయ ఓనమాలు దిద్దించిన పుల్లారావు, ఆమె చేతిలోనే ఓడిపోవడం గమనార్హం. దీంతో స్వయంగా తన ఓటమిని పుల్లారావు తానే కొని తెచ్చుకున్నట్లయింది.
అసలు ఏం జరిగిందంటే, రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేని ఎన్నారైగా, బీసీ వర్గానికి చెందిన మహిళగా ఉన్న విడుదల రజని, ఏడాది క్రితం ఏపీకి వచ్చి తొలుత తెలుగుదేశం పార్టీలోనే చేరారు. గత సంవత్సరం అమెరికా నుంచి వచ్చిన ఆమె, ప్రత్తిపాటి పుల్లారావు నేతృత్వంలో పచ్చ కండువాను కప్పుకున్నారు.
ఆపై కొన్ని నెలలకు తనకు చిలకలూరిపేట ఎమ్మెల్యే టికెట్ కావాలనే డిమాండ్ ను తెరమీదికి తెచ్చారు. దీంతో వరుస విజయాలతో ఉన్న తాను మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని అనుకుంటున్నానని, కావాలంటే నరసరావుపేట నుంచి ఎంపీగా టికెట్ ఇప్పిస్తానని ఆమెకు చెప్పారట. అయితే రజని మాత్రం తనకు ఎమ్మెల్యే టికెట్ మాత్రమే కావాలని కుండబద్దలు కొడుతూ, టీడీపీని వీడి వైసీపీలో చేరారు.
ఆ క్షణం నుంచి నియోజకవర్గంలో పర్యటనలు ప్రారంభించి ప్రజలకు దగ్గరయ్యారు. పుల్లారావును ఓడిస్తానని ఆమె చేసిన శపథం, బీసీ వర్గాలకు చెందివుండటం, ఆర్థికంగా పుష్టిగా ఉండటంతో జగన్ సైతం రజనీకి టికెట్ ఇస్తున్నట్టు ప్రకటించారు. ఎన్నికల వేవ్ లో ఆమె అనుకున్నంత పనీ చేసి, తనను రాజకీయాలకు పరిచయం చేసిన గురువుపైనే గెలిచి సత్తా చాటడం గమనార్హం.