TTD administrative council: టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం రేపు...రాష్ట్రంలో అధికార మార్పిడి నేపథ్యంలో ప్రాధాన్యం
- టీడీపీ హయాంలో మండలి నియామకం
- ఏడాది పూర్తి కాగా మరో ఏడాది పదవీ కాలం
- ఉంటారా...కొత్తవారు వస్తారా? అన్నదానిపై సందిగ్ధం
ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ధర్మకర్తల మండలి సమావేశం రేపు జరగనుంది. తెలుగుదేశం ప్రభుత్వం నియమించిన పుట్టా సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో మండలి కొనసాగుతోంది. రాష్ట్రంలో టీడీపీ అధికారం కోల్పోయి, వైసీపీ కొత్తగా పగ్గాలు చేపట్టనున్న నేపథ్యంలో మండలి కొనసాగింపుపై సందిగ్ధం నెలకొంది. అందుకే సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.
వాస్తవానికి ఇప్పటికే సమావేశం నిర్వహించాల్సి ఉండగా ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడింది. తాజాగా రాష్ట్రంలో ప్రభుత్వం కూడా మారిపోవడంతో నామినేటెడ్ పదవుల విషయంలో సందేహాలు నెలకొన్నాయి. ఇటువంటి సందర్భాల్లో స్వచ్చందంగానే చాలామంది పదవులు వదులుకుంటారు. కాకపోతే టీటీడీ పదవులు సెంటిమెంట్‌తో కూడుకున్నవి కావడంతో సభ్యులెవరూ రాజీనామా చేయడానికి ఇష్టపడడం లేదని సమాచారం. ఒక వేళ కొత్త ప్రభుత్వం తొలగిస్తే అప్పుడు చూడొచ్చన్నది వారి అభిప్రాయంగా తెలుస్తోంది.
దీంతో ఈనెల 28న సమావేశముందని టీటీడీ సెల్ నుంచి సమాచారం అందగానే ఆదివారం రాత్రికే పలువురు సభ్యులు తిరుమల చేరుకున్నారు. ఇక సమావేశంలో తీసుకునే నిర్ణయాలు, మండలి భవితవ్యం ఏమిటన్నది త్వరలో తేలనుంది.