Crime News: ప్రేమిస్తున్నానని అమ్మాయి చెబితే నమ్మి నట్టేట మునిగిన హైదరాబాదీ!
- బీహెచ్ఈఎల్ లో పని చేసి రిటైర్ అయిన ఉద్యోగి
- విదేశీ యువతిగా ఏంజెలా పరిచయం
- పెళ్లి చేసుకుంటానని చెబితే నమ్మిన బాధితుడు
ఫేస్ బుక్ లో తనకు వచ్చిన ఓ యువతి ఫ్రెండ్ రిక్వెస్ట్ ను ఓకే చేసిన హైదరాబాద్ కు చెందిన ఓ వృద్ధుడు, ఆమె ప్రేమిస్తున్నానంటే నమ్మి నిండా మునిగిపోయాడు. సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల్లోకి వెళితే, బీహెచ్ఈఎల్ లో పని చేసి పదవీ విరమణ చేసిన ఉద్యోగి (68), ఫేస్ బుక్ చూస్తుంటే, విదేశీ యువతి ఏంజెలా డొనాల్డ్ తో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్యా స్నేహం పెరిగి గంటల కొద్దీ చాటింగ్ వరకూ వెళ్లింది. ఈ క్రమంలో తాను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుందామని ఆ యువతి చెప్పడంతో, తన వయసును కూడా మరచిపోయిన ఆయన సరేనన్నాడు. తన వద్ద రూ. 1.3 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 10 కోట్లు) ఉన్నాయని, వాటిని తీసుకోవాలని ఆమె చెప్పగా, సంతోషంతో గంతులేశాడు.
ఆపై ఈ నెల 18న రోహిత్ అనే వ్యక్తి నుంచి బాధితుడికి ఫోన్ వచ్చింది. ముంబై ఎయిర్ పోర్టుకు ఏంజెలా డొనాల్డ్ నుంచి ఓ పార్శిల్ వచ్చిందని, దాన్ని పంపాలంటే, బీమా కింద రూ. 65,800 కట్టాలని చెప్పడంతో, అతను చెప్పిన ఖాతాలో డబ్బులేశాడు. మరుసటి రోజు మళ్లీ ఫోన్ చేసి, కస్టమ్స్ క్లియరెన్స్ ఇంకా పూర్తి కాలేదని, మరో రూ. 2.35 లక్షలు కట్టాలంటే ఆ పని కూడా చేశాడు. ఆపై 21వ తేదీన ఆర్బీఐ పేరుతో ఓ ఈ మెయిల్ వచ్చింది. ఈమెయిల్ లింక్ ను క్లిక్ చేసి ఆన్ లైన్ ఖాతాను తెరిస్తే, అందులో డబ్బులేస్తామని అందులో ఉండటంతో బాధితుడు ఆన్ లైన్ ఖాతాను తెరిచాడు. ఆపై రోజులు గడుస్తున్నా డబ్బు జమ కాకపోవడం, ఫోన్ నంబర్లు పనిచేయక పోవడంతో మోసపోయానని గుర్తించి పోలీసులను ఆశ్రయించాడు. సైబరాబాద్ పోలీసులు ఐపీసీ సెక్షన్ 417, 219, 420లతో పాటు ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించారు.