Andhra Pradesh: ‘పవన్ కల్యాణ్-మల్లెపూలు’ కామెంట్ ఎందుకు చేశానంటే..!: సాధినేని యామిని

  • నాకంటే నోటిదురుసు ఉన్నవాళ్లు పార్టీలో చాలామంది ఉన్నారు
  • నేను ఇతరుల జీవితాల్లోకి తొంగి చూడలేదు
  • యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యామిని

నవ్యాంధ్ర నిర్మాణంలో చంద్రబాబుకు అండగా నిలవాలన్న ఉద్దేశంతో తాను టీడీపీలో చేరారని ఆ పార్టీ అధికార ప్రతినిధి సాధినేని యామిని తెలిపారు. అంతకుముందు తాను హామ్ రేడియోలో పనిచేస్తూ ప్రపంచదేశాలు తిరిగేదాన్నని చెప్పారు. తాను అప్పుడప్పుడూ టీవీ డిబేట్లలో పాల్గొనేదాన్నని వ్యాఖ్యానించారు. ‘సాధినేని యామినికి నోటి దురుసు ఎక్కువ. వాటి కారణంగానే ఆమెకు అనుకోకుండా అవకాశం వచ్చింది’ అని కొందరు సోషల్ మీడియాలో చెప్పడంపై ఆమె స్పందించారు.

తన కంటే ఎక్కువ నోటి దురుసు, విషయ పరిజ్ఞానం ఉన్నవారు టీడీపీలో ఉన్నారనీ, ఈ లెక్కన వారందరికీ అవకాశాలు రావాలి కదా? అని ప్రశ్నించారు. ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యామిని మాట్లాడారు. సాధినేని యామిని ఇతరుల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూస్తున్నారు అనే ఆరోపణలను ఆమె ఖండించారు. ‘నేను ఇంతవరకూ నా భాష చూడండి. అవతల వ్యక్తిని నేను ఇంతవరకూ విమర్శించలేదు. వాళ్లకు కౌంటర్ ఇచ్చానంతే. మేం ఏపీలో అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలు ఆరోపణలు చేసేవారు. నేను దాన్ని ఖండిస్తూ, మేం ఐదేళ్ల కాలంలో ఏం చేశామో చెప్పేదాన్ని’ అని స్పష్టం చేశారు.

పవన్ కల్యాణ్ మల్లెపూలను తప్ప దేన్నీ నలపలేరు అన్న వ్యాఖ్యలపై ఈ సందర్భంగా యామిని స్పందించారు. ‘ఎవరైనా ఆరోపణలు చేసినప్పుడు ఒక హద్దు అనేది ఉండాలి. చంద్రబాబు లాంటి సీనియర్ వ్యక్తిని పవన్ కల్యాణ్ తాట తీస్తాను, తోలు తీస్తాను అని పదేపదే అన్నారు. అభిమానులు ఒక పార్టీ నాయకుడికి మాత్రమే ఉండరు. చంద్రబాబుకు కూడా ఉంటారు. నేను ఓ కానిస్టేబుల్ కొడుకుని అని పవన్ చెప్పుకున్నారు.

ఓ నక్సలైట్ ను వెనకేసుకొచ్చారు. దీంతో నాయకులపై ఇష్టానుసారం విమర్శలు చేయడానికి వాళ్లేమీ మల్లెపూలు, చిత్తుకాగితాలు కాదు అని కౌంటర్ ఇచ్చాను. అది యాదృచ్ఛికంగా జరిగిందే తప్ప కావాలని చెప్పింది కాదు’ అని యామిని తెలిపారు. తాను 30 దేశాల్లో తిరిగాననీ, బాగా చదువుకున్నాననీ, తాను ఏమి మాట్లాడుతున్నానో తనకు బాగా తెలుసని చెప్పారు.

  • Loading...

More Telugu News