Narendra Modi: మోదీ కొత్త వాహనం ప్రత్యేకతలు ఇవే!
- రేంజ్ రోవర్ కారులో వారణాసి వెళ్లిన మోదీ
- 7.8 సెకన్లలో 100 కిమీ వేగం
- కారు టాప్ స్పీడ్ గంటకు 209 కిమీ
మరోసారి ప్రధాని పీఠంపై కూర్చోబోతున్న నరేంద్ర మోదీ మాంచి హుషారు ప్రదర్శిస్తున్నారు. అహ్మదాబాద్ వెళ్లి తల్లి ఆశీస్సులు పొందిన ఆయన ఇవాళ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా మోదీ ప్రయాణించిన కొత్త వాహనం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆయన నలుపు రంగులోని రేంజ్ రోవర్ వాహనంలో ప్రయాణించారు. దీని ప్రత్యేకతలు అన్నీ ఇన్నీ కావు.
ఇది పెట్రోల్ వెర్షన్ కారు. దీంట్లో 3 లీటర్ వీ6 టర్బో చార్జ్ డ్ ఇంజిన్ పొందుపరిచారు. మాగ్జిమమ్ 340 హార్స్ పవర్ తో 6500 ఆర్పీఎమ్ శక్తిని ఇస్తుంది. ఇందులో 8 గేర్ల ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఉండడంతో డ్రైవింగ్ నల్లేరుపై నడకలా సాగుతుంది. ముఖ్యంగా, దీని వేగం అద్భుతం అని చెప్పాలి. 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 7.8 సెకన్లలోనే అందుకుంటుంది. ఈ రేంజ్ రోవర్ అత్యధికంగా గంటకు 209 కిలోమీటర్ల వేగంతో పయనిస్తుంది.
ఎలాంటి ఉపరితలంపై అయినా సాఫీగా ప్రయాణించేందుకు వీలుగా ఆల్ టెర్రయిన్ కంట్రోల్ యూనిట్, టైర్లలో గాలి పరిమాణాన్ని సూచించే టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, అత్యధిక వేగంలో కూడా వాహనం అదుపుతప్పకుండా డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్, ఎమర్జన్సీ బ్రేక్ అసిస్టెన్స్, యాక్టివ్ స్పీడ్ లిమిటర్ వంటి అదనపు సొబగులు ఉన్నాయి.
ఇక, ప్రధాని ప్రయాణించే వాహనం కావడంతో దీన్ని పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్ మెటీరియల్ తో రూపొందించినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా, కమ్యూనికేషన్ పరంగానూ, సెక్యూరిటీ పరంగానూ అనేక ఫీచర్లు ఏర్పాటుచేసినట్టు సమాచారం. కాగా, మోదీ గతంలో బీఎండబ్ల్యూ కారును ఉపయోగించేవారు. దాని స్థానంలో ఆయన కాన్వాయ్ లోకి రేంజ్ రోవర్ వచ్చిచేరింది.