Gauri Lankesh: జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్య కేసును దర్యాప్తు చేస్తున్న ‘సిట్’కు రూ.25 లక్షల నగదు బహుమతి
- సెప్టెంబరు 5, 2017లో హత్యకు గురైన గౌరీ లంకేశ్
- కేసును శద్ధగా దర్యాప్తు చేస్తున్నందుకు ప్రభుత్వం నగదు నజరానా
- గౌరీ హత్యతో సనాతన్ సంస్థాన్ ప్రమేయం ఉందంటూ సిట్ చార్జిషీట్
కర్ణాటకలో సంచలనం సృష్టించిన జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్య కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)కు ప్రభుత్వం రూ.25 లక్షల నజరానా ప్రకటించింది. హత్యకేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నందుకు గాను ప్రభుత్వం ఈ నగదు రివార్డును ప్రకటించింది.
లంకేశ్ హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ గతేడాది నవంబరు 24న సిటీ కోర్టులో అదనపు చార్జిషీటు దాఖలు చేసింది. ఇందులో సనాతన్ సంస్థాన్ పేరును పేర్కొంది. గౌరీ లంకేశ్ హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 18 మంది ఈ గ్రూపులో చురుగ్గా ఉన్నట్టు తెలిపింది. ‘క్షాత్రధర్మ సాధన’ అనే పుస్తకంలో పేర్కొన్న నిబంధనలను, సూత్రాలను ఈ సంస్థ సభ్యులు కచ్చితంగా ఆచరిస్తారని సిట్ వివరించింది. కాగా, సిట్ ఆరోపణలను సనాతన్ సంస్థాన్ కొట్టిపారేసింది. గౌరీ లంకేశ్ హత్య కేసుతో తమకు ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. కాగా, సెప్టెంబరు 5, 2017లో సీనియర్ జర్నలిస్టు అయిన గౌరీ లంకేశ్ తన ఇంటి వద్ద హత్యకు గురయ్యారు.