NTR: తప్పు టీఆర్ఎస్ ప్రభుత్వానిదే... ఎన్టీఆర్ ఘాట్ నిర్లక్ష్యంపై టీడీపీ కార్యకర్తల ఆగ్రహం!
- అలంకరణ బాధ్యతలు చేపట్టే జీహెచ్ఎంసీ
- ఈ సంవత్సరం మాత్రం కళావిహీనం
- మండిపడుతున్న టీడీపీ కార్యకర్తలు
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరమూ ముందు రోజునే తెలంగాణ ప్రభుత్వం ఎన్టీఆర్ ఘాట్ ను అలంకరిస్తుందని, జీహెచ్ఎంసీ ముందుగానే అందుకు ఏర్పాట్లు చేస్తుందని, ఈ సంవత్సరం కావాలనే ఘాట్ ను అలంకరించలేదని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉదయం ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నక్లెస్ రోడ్ లోని ఘాట్ పూల అలంకరణలు లేక బోసిపోవడం, తొలుత వచ్చిన ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లు అసహనాన్ని వ్యక్తం చేస్తూ, అక్కడే కూర్చుని, అనుచరులతో పూలు తెప్పించి అలంకరించిన సంగతి తెలిసిందే.
ప్రతియేటా మే 28 వస్తే ఎన్టీఆర్ ఘాట్ కళకళలాడుతుంది. వందల కిలోల పూలతో ఎన్టీఆర్ సమాధిని అలంకరించి, అక్కడి ఆర్చ్ లకు కొత్త రంగులద్ది ముస్తాబు చేస్తారు. ఈ సంవత్సరం మాత్రం ప్రముఖులు వచ్చేసరికి అక్కడ కళావిహీన వాతావరణమే కనిపించింది. ఇందుకు తెరాస ప్రభుత్వమే కారణమని, వారు అలంకరించడం లేదని తమకు ముందే తెలిస్తే, సోమవారమే వచ్చి పనులు చూసుకునేవారమని టీడీపీ స్థానిక నేతలు అంటున్నారు. ఎన్టీఆర్ ఉన్నంతవరకూ ఆయన వెంట తిరిగి, రాష్ట్రం విడిపోయిన తరువాత టీఆర్ఎస్ లో చేరిన నేతలు సైతం ఎన్టీఆర్ ను మరిచారని విమర్శలు గుప్పించారు.