Congress: ఎమ్మెల్యేలు జారిపోకుండా చూసుకునే బాధ్యతను మంత్రులకు అప్పగించిన మధ్యప్రదేశ్ సీఎం!
- ఎస్పీ, బీఎస్పీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు
- గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్న కమల్‌నాథ్ ప్రభుత్వం
- కాంగ్రెస్ ప్రభుత్వానికి కాలం చెల్లినట్టేనని ప్రచారం
2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ నుంచి ఒకరు, బీఎస్పీ నుంచి ఇద్దరు కాంగ్రెస్‌కు మద్దతివ్వడంతో మధ్యప్రదేశ్ లో ఏర్పడిన కమల్‌నాథ్ ప్రభుత్వం ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. సార్వత్రిక ఎన్నికల్లో 29 లోక్‌సభ స్థానాలకు గాను కేవలం ఒక స్థానాన్ని మాత్రమే అధికార కాంగ్రెస్ గెలుచుకుంది. దీనికి తోడు శాసన సభలో ప్రభుత్వం బలం నిరూపించుకోవాలని ఆదేశించాలని కోరుతూ ప్రతిపక్ష నాయకుడు గోపాల్ భార్గవ గవర్నర్‌కు లేఖ రాశారు. దీంతో ప్రభుత్వం ఎక్కడ కూలిపోతుందోనన్న అభద్రతా భావంలో కాంగ్రెస్ కొట్టుమిట్టాడుతున్నట్టు తెలుస్తోంది.
దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇక కాలం చెల్లినట్టేనని ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కమల్‌నాథ్ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి ప్రయత్నాలు మొదలెట్టారు. రాష్ట్ర మంత్రులకు ఒక్కొక్కరికీ ఐదుగురు ఎమ్మెల్యేల బాధ్యతను అప్పగించారు. తమ తమ నియోజకవర్గాల పరిధిలో అభివృద్ధి పనులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యతను కూడా మంత్రుల పైనే ఉంచారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల మంత్రులు ఎమ్మెల్యేలతో వేర్వేరుగా సమావేశం నిర్వహించగా, మంత్రుల పనితీరుపై ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం.