Telangana: కేసీఆర్ బిడ్డను సైతం ఓడించాం: బీజేపీ నేత లక్ష్మణ్
- కేసీఆర్ కుడి భుజం అయిన వినోద్ నూ ఓడించాం
- ఉత్తర తెలంగాణ నుంచి బీజేపీ విజయం మొదలైంది
- కేసీఆర్ తో చేసుకున్న ఒప్పందం వల్లే ఉత్తమ్ గెలిచారు
తెలంగాణలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ బిడ్డ కవితను సైతం తాము ఓడించామని టీ-బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ కూతురు కవితను, ఆయన కుడి భుజం అయిన వినోద్ ను తమ ఎంపీ అభ్యర్థులు ఓడించారని అన్నారు. ఉత్తర తెలంగాణ నుంచి బీజేపీ విజయ దుందుభి మొదలైందని అన్నారు. ఎన్నికలకు ముందు మోదీ హవా లేదన్న కేటీఆర్, ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. కేటీఆర్ మాటలు చూస్తుంటే ఆడలేక మద్దెల ఓడు అన్న చందంగా ఉందని అన్నారు.
లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చావు తప్పి కన్ను లొట్టబోయినట్టయిందని లక్ష్మణ్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టారని అన్నారు. కేసీఆర్ తో చేసుకున్న ఒప్పందం కారణంగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ ఎంపీగా విజయం సాధించారని ఆరోపించారు. తెలంగాణలో మూడు ఎంపీ స్థానాల్లో గెలిచి ఉత్తమ్ జబ్బలు చరచుకుంటున్నారని అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని అభిప్రాయపడ్డారు.