Andhra Pradesh: డేటాచోరీ కేసు.. ఐటీ గ్రిడ్స్ సీఈవో అశోక్ కు లభించని ఊరట!
- ముందస్తు బెయిల్ కోసం అశోక్ దరఖాస్తు
- విచారణను జూన్ 4కు వాయిదా వేసిన కోర్టు
- ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న ఐటీ గ్రిడ్స్ అశోక్
ఏపీ ప్రజల డేటా చోరీ కేసులో ఐటీ గ్రిడ్స్ సంస్థ సీఈవో అశోక్ కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని అశోక్ దాఖలు చేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ఇప్పటికిప్పుడు బెయిల్ ఇవ్వడానికి అంగీకరించలేదు. . అనంతరం తదుపరి విచారణను వచ్చే నెల 4కు వాయిదా వేసింది. ఐటీ గ్రిడ్స్ అశోక్ ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న సంగతి తెలిసిందే.
తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని అశోక్ దాఖలు చేసిన పిటిషన్ ను ఇటీవల రంగారెడ్డి కోర్టు కొట్టివేసింది. దీంతో ఆయన తాజాగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అంతకుముందు తనపై మాదాపూర్ పోలీసులు నమోదు చేసిన కేసులను కొట్టివేయాలంటూ అశోక్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని ధర్మాసనం ఎప్పుడు విచారిస్తుందో ఇంకా స్పష్టత రాలేదు. కాగా, అశోక్ ను పట్టుకునేందుకు తెలంగాణ పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విజయవాడ, విశాఖపట్నం, ముంబై, బెంగళూరులో గాలిస్తున్నారు.