Padmavati: 80 కి.మీ. వేగంతో వెళుతున్న 'పద్మావతి' ఎక్స్ ప్రెస్... కిందపడినా మృత్యుంజయుడైన వరంగల్ బాలుడు!
- కుటుంబీకులతో కలిసి తిరుమలకు
- తిరుగు ప్రయాణంలో ప్రమాదం
- తీవ్రగాయాలైనా తప్పించుకున్న వినోద్
అది తిరుపతి నుంచి సికింద్రాబాద్ కు ప్రయాణిస్తున్న పద్మావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్. స్లీపర్ క్లాస్ లో తన తల్లిదండ్రులతో కలసి ప్రయాణిస్తున్న 11 ఏళ్ల బాలుడు, గేమ్ ఆడుకుంటూ, మూత్ర విసర్జనకు వెళ్లాడు. రద్దీ అధికంగా ఉన్న కారణంగా పలువురు టాయిలెట్ ముందు కూర్చుని ఉన్న నేపథ్యంలో లోనికి వెళ్లలేక, గేటు వద్ద నిలబడి పాస్ పోస్తూ ప్రమాదవశాత్తూ కిందపడ్డాడు. ఆ సమయంలో రైలు దాదాపు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. తీవ్రగాయాలపాలైనా ఆ బాలుడు మృత్యుంజయుడయ్యాడు.
మరిన్ని వివరాల్లోకి వెళితే, వరంగల్ కు చెందిన ముక్కెర మధు, తన ముగ్గురు కుమారులు, కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి రెండు రోజుల క్రితం శ్రీవారి దర్శనానికి తిరుమల వెళ్లారు. తిరుగు ప్రయాణంలో భాగంగా పద్మావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ఎస్7 బోగీ ఎక్కారు. రాత్రి 9.30 గంటల సమయంలో రైలు ఒంగోలు దాటి చినగంజాం - కడవకుదురు మధ్య వెళ్తున్న వేళ, మధు రెండో కుమారుడు వివేక్ సెల్ ఫోన్ లో ఆటాడుతూ, మూత్ర విసర్జనకు వెళ్లాడు.
టాయిలెట్ లోపలికి వెళ్లలేక, డోర్ వద్ద నిలబడి మూత్ర విసర్జన చేస్తుండగా మలుపు వచ్చింది. బండి కుదుపునకు వివేక్ కిందపడగా, ఎవరూ గమనించలేదు. కాసేపటికి కుమారుడు రాకపోవడంతో బోగీలన్నీ వెతికిన మధు, రైలు నుంచి పడిపోయి ఉంటాడని రోదిస్తూ, బాపట్లలో పోలీసులను ఆశ్రయించాడు. వారి సూచనతో చినగంజాం చీరాల మధ్య బాలుడు పడిపోయి ఉంటాడని అంచనా వేసిన పోలీసులు, గేట్ మన్ లకు సమాచారం ఇచ్చారు.
దీంతో కీమెన్ లు, గేట్ మెన్ లు బాలుడి కోసం వెతుకగా, తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో కడవకుదురు జడ్పీ ఉన్నత పాఠశాల సమీపంలో తీవ్ర గాయాలతో పడున్న వినోద్ ను గుర్తించారు. వినోద్ కిందపడిన ప్రాంతంలో రాళ్లపై గడ్డి మొలిచి ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. వినోద్ స్పృహలోనే ఉండడంతో వివరాలు అడిగి, వెంటనే తండ్రితో మాట్లాడించిన అధికారులు, చీరాల ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలకు అతన్ని తరలించారు. ప్రస్తుతం వినోద్ ప్రాణాలకు ముప్పు లేదని వైద్యులు స్పష్టం చేయడంతో తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.