Jagan: ఈ ఉదయం కూడా విజయవాడలో వర్షం... జగన్ ప్రభావమంటున్న వైసీపీ శ్రేణులు!
- కరవు తీరిపోయి నేల సస్యశ్యామలం అవుతుంది
- జగన్ కు దేవుడి ఆశీర్వాదం ఉందంటున్న వైసీపీ
- శివార్లలోనే ఆగిపోతున్న కార్యకర్తల వాహనాలు
గత రాత్రి భారీ వర్షం కురిసినప్పటికీ, జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఇబ్బందులు రాకూడదని అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేయగా, ఈ ఉదయం నుంచి కూడా విజయవాడలో చిరుజల్లులు కురుస్తూనే ఉన్నాయి. ఇక ఇది జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న వేళ, భగవంతుడి ఆశీర్వాదమని, కరవు పోయి, నేల సస్యశ్యామలం అవుతుందని వైసీపీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి.
కాగా, భారీ వర్షం పడినా ఏ విధమైన ఆటంకం లేకుండా ప్రమాణ స్వీకారోత్సవం పూర్తయ్యేందుకు ఏర్పాట్లు చేశామని, ఎవరూ తడవకుండా టెంట్లు నిర్మించామని అధికారులు తెలిపారు. కాగా, అనంతపురం, చిత్తూరు జిల్లాల నుంచి ఈ ఉదయం విజయవాడకు వచ్చిన వందలాది మంది వైసీపీ కార్యకర్తలను పోలీసులు మంగళగిరి సమీపంలోను; విశాఖ, శ్రీకాకుళం నుంచి వచ్చిన వారిని గన్నవరం సమీపంలోను నిలిపివేయడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. స్టేడియం ఇప్పటికే నిండిపోయిన కారణంగా సాధారణ ప్రజలను నగరంలోకి వాహనాలతో అనుమతించబోమని పోలీసులు అంటున్న పరిస్థితి కనిపిస్తోంది.