Odisha: పెళ్లి పేరుతో నైజీరియన్ వల...రూ.6.28 లక్షలకు టోకరా
- భార్య చనిపోయిందని, మనం పెళ్లి చేసుకుందామని ప్రతిపాదన
- నిజమేనని నమ్మిన ఒడిశా మహిళ
- అత్యవసరమంటూ దఫదఫాలుగా డబ్బు గుంజిన వైనం
విభేదాల కారణంగా భర్తతో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్న మహిళకు పెళ్లి పేరుతో వల విసిరాడో నైజీరియన్. తన భార్య చనిపోయిందని, వేల కోట్ల రూపాయల ఆస్తులు తనకు ఉన్నాయని, నీకు అంగీకారం అయితే పెళ్లి చేసుకుందామని ప్రతిపాదించాడు. నిజమేనని నమ్మిన ఆమె నుంచి ఆరు లక్షల మేరకు గుంజేసి మోసం చేశాడు.
వివరాల్లోకి వెళితే...ఒడిశా రాష్ట్రానికి చెందిన ఓ మహిళకు రెండేళ్ల క్రితం పెళ్లయింది. భర్తతో విభేదాల కారణంగా విడిపోయింది. అనంతరం ఉద్యోగం వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చి ఓ ప్రైవేటు కంపెనీలో చేరింది. తల్లిదండ్రులు మళ్లీ పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తుండడంతో మాట్రిమోనీలో తన వివరాలు అప్లోడ్ చేసింది.
నెల క్రితం ఓ వ్యక్తి ఫోన్‌చేసి తన పేరు యష్ సలుజా అని పరిచయం చేసుకున్నాడు. తనకు ఇది వరకే పెళ్లయి భార్య చనిపోయిందని, తమకో బాబు ఉన్నాడని తెలిపాడు. నీ వివరాలు చూశాక మా బాబును బాగా చూసుకుంటావన్న నమ్మకం కలిగిందని, అందువల్ల మనం పెళ్లి చేసుకుందామని ప్రతిపాదించాడు. ఇలా కొన్నాళ్లపాటు ఇద్దరి మధ్యా మాటలు కొనసాగాక అతనిపై ఆ యువతి నమ్మకం ఏర్పర్చుకుంది.
ఈ నేపథ్యంలో ఓ రోజు యష్ సలుజా ఫోన్‌చేసి రెండేళ్ల క్రితం తన భార్య చనిపోతూ మలేషియా బ్యాంకులో 200 కోట్ల డాలర్లు (భారత్ కరెన్సీలో 14 వేల కోట్లు) డిపాజిట్ చేసిందని, ఆ సొమ్ము తెచ్చుకునేందుకు ఆ దేశం వెళ్తున్నానని, ఆ పని పూర్తికాగానే ఇండియాకు వచ్చాక మనం పెళ్లి చేసుకుందామని తెలిపాడు. మలేషియాకు వెళ్తున్నానని చెప్పిన నైజీరియన్ ఈనెల 9న సదరు యువతికి ఫోన్‌చేసి మలేషియా బ్యాంకు నుంచి డబ్బు తీసుకోవాలంటే రూ.15 లక్షలు కట్టాలని, తన స్నేహితుడి నుంచి రూ.10 లక్షలు తీసుకున్నానని, నువ్వు రూ.2 లక్షలు ఇస్తే, మిగిలింది ఎవరివద్దయినా తీసుకుంటానని నమ్మబలికాడు. నిజమే అనుకుని సదరు యువతి అతను చెప్పిన ఖాతాలో రూ.2 లక్షలు వేసింది.
రెండు రోజుల తర్వాత మళ్లీ ఫోన్ చేసి అప్పు ఇస్తానన్న వ్యక్తి ఇవ్వలేదని, మరో రూ.2 లక్షలు ఇవ్వగలవా? అని కోరాడు. ఆ మొత్తాన్ని అతని అకౌంట్లో వేసింది. మే 14న ఇంకోసారి ఫోన్ చేసి మరో రూ.2 లక్షలు సర్దితే కేవలం మూడు గంటల వ్యవధిలో మొత్తం డబ్బు నీ అకౌంట్‌కి జమ చేస్తానని నమ్మించాడు. దీంతో చేతిలో డబ్బు లేకపోవడంతో బంగారు ఆభరణాలు తనఖా పెట్టి మరీ డబ్బు అతని అకౌంట్లో వేసింది.
మరునాడే మళ్లీ ఫోన్ చేసి రూ.30 వేలు తక్కువయ్యాయని, ఎలాగైనా సర్దాలని బతిమిలాడాడు. అకౌంట్లో అప్పటికి కేవలం రూ.28 వేలు మాత్రమే ఉండడంతో ఆ మొత్తం తీసి వేసింది. మర్నాడు ఆమె ఫోన్ చేసి తన వద్ద రూపాయి లేదని, కొంత డబ్బు తన అకౌంట్‌కు వేయాలని కోరగా, ఇంకా తనకే రూ.3 లక్షలు కావాలంటూ ఎదురు తిరిగాడు. దీంతో తాను మోసపోయానని గుర్తించిన సదరు యువతి సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది.