NRI's: మోదీ పనితీరుకు జై కొట్టిన అమెరికాలో స్థిరపడిన భారతీయులు
- ఓ సర్వేలో 93.9 శాతం మంది మద్దతు
- విదేశీ మంత్రిత్వ శాఖకు మరింత మంది అనుకూలం
- అమెరికాలోని అంతర్జాతీయ సంస్థ ఎఫ్‌ఐఐడీఎస్ సర్వే
అమెరికాలో స్థిరపడిన భారతీయులు (ఎన్‌ఆర్‌ఐ) ప్రధాని మోదీ పనితీరుకు జై కొట్టారు. ఏకంగా 93.9 శాతం మంది తమ మద్దతు తెలిపారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తిరిగి మోదీ విజయం సాధించడాన్ని స్వాగతించారు. ఆమెరికాకు చెందిన అంతర్జాతీయ సంస్థ ఫౌండేషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్ డయాస్పోరా స్టడీస్ (ఎఫ్‌ఐఐడీఎస్) ఈ నెల మొదట్లో ఓ పోల్ నిర్వహించి మోదీ పనితీరుపై కొన్ని ప్రశ్నలు అడిగింది.
ఈ సర్వేలో అన్ని విషయాల్లో మోదీ పనితీరుకు 93.9 శాతం మంది జై కొట్టారు. విదేశాంగ శాఖ పని తీరును 95.5 శాతం మంది, మౌలిక సదుపాయాల కల్పనకు 93 శాతం, విదేశాంగ విధానంపై 92 శాతం మద్దతు తెలిపారు. మోదీ ప్రవేశపెట్టిన పథకాలు భారత్ అభ్యున్నతికి బాగా తోడ్పడుతున్నాయని 80 శాతం మంది చెప్పగా ఇందులో 86.9 శాతం స్వచ్ఛభారత్‌కు, 84.6 శాతం మేక్ ఇన్ ఇండియాకు, 84.3 శాతం డిజిటల్ ఇండియాకు, 71 శాతం స్టార్టప్ ఇండియాకు మద్దతు తెలిపారు.
మోదీ ప్రభుత్వంలో మత ఘర్షణలు అదుపులో ఉన్నాయని 82.5 శాతం అభిప్రాయపడగా, ఉగ్రవాద నిర్మూలనకు అవంబిస్తున్న విధానాలు బేష్ అని 92 శాతం కొనియాడారు. వృద్ధి విషయంలో భారత్ సరైన మార్గంలోనే ప్రయాణిస్తోందని 90.3 శాతం మంది అభిప్రాయపడగా, మోదీది కుంభకోణాల్లేని ప్రభుత్వమని 97 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇక సార్వత్రిక ఎన్నికల్లో రామ జన్మభూమి, శబరిమల ఆలయ అంశాలు కీలకంగా వ్యవహరించాయని 63.3 శాతం మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.