Congress: మీడియాలో కనిపించొద్దు... నేతలకు కాంగ్రెస్ అధిష్ఠానం కీలక ఆదేశాలు
- ఇటీవలి ఎన్నికల్లో ఘోర పరాభవం
- మీడియా చర్చల్లో పాల్గొనవద్దు
- ఆదేశించిన పార్టీ మీడియా కమిటీ
ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తరువాత కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ నేతలు ఎవరూ మీడియా ఛానళ్లు నిర్వహించే చర్చల్లో పాల్గొనవద్దని ఆదేశించింది. ఈ ఆదేశాలు నెల రోజుల పాటు అమలులో ఉంటాయని కాంగ్రెస్ పార్టీ మీడియా ఇన్ చార్జ్ రణ్ దీప్ సింగ్ సూర్జేవాలా ఈ ఉదయం ఓ ప్రకటనలో తెలిపారు.
పార్టీ అధికార ప్రతినిధులు మీడియా ఛానళ్ల చర్చల్లో పాల్గొనవద్దని, ఇందుకు మీడియా కూడా సహకరించాలని సుర్జేవాలా విజ్ఞప్తి చేశారు. కాగా, లోక్ సభ ఎన్నికల అనంతరం రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయగా, దాన్ని సీడబ్ల్యూసీ అంగీకరించని సంగతి తెలిసిందే. తన రాజీనామా విషయంలో రాహుల్ సైతం గట్టి పట్టుదలతో ఉన్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో మీడియా చర్చల్లో ఎవరూ పాల్గొనవద్దని పార్టీ ఆదేశించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
కాగా, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై ఊహాజనిత కథనాలు వస్తుండటంతో, చర్చల్లో పాల్గొనే వారు వీటిపై వివరణ ఇవ్వాల్సి రావచ్చని, ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లకుండా చూసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని పార్టీ నేతలు అంటున్నారు.