Kishan Reddy: శాసనసభ ఎన్నికల్లో ఓటమే కిషన్‌రెడ్డికి వరంలా మారింది!
- మోదీతో పాటు ప్రమాణ స్వీకారం చేయనున్న కిషన్‌రెడ్డి
- టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో స్వల్ప తేడాతో ఓటమి
- ఎంపీ అభ్యర్థిగా 60వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం
నరేంద్రమోదీ మంత్రివర్గంలో తెలంగాణ రాష్ట్రం నుంచి కిషన్ రెడ్డికి చోటు లభించడం పట్ల రాష్ట్ర బీజేపీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సికింద్రాబాద్ ఎంపీగా గెలుపొందిన ఆయనకు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా మోదీతో పాటు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని ఫోన్ చేసి తెలిపారు. దీంతో కిషన్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లారు.
అయితే కిషన్‌రెడ్డి 2018లో జరిగిన ముందస్తు శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. ఇదే ఆయనకు వరంలా మారింది. నాలుగు మాసాల వ్యవధిలోనే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థిపై 60 వేల పై చిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొంది నేడు కొలువుదీరనున్న కేంద్ర మంత్రివర్గంలో స్థానం సంపాదించుకున్నారు.